ప్రతి భూకబ్జాలో ఆయన ప్రమేయం ఉంది

9 May, 2018 20:51 IST|Sakshi

రంగాను హత్య చేసి పారిపోయి విశాఖ వచ్చాడు

ఎమ్మెల్యే రామకృష్ణ బాబుపై  విజయసాయి రెడ్డి ధ్వజం

సాక్షి, విశాఖపట్నం : ముప్పైఏళ్లపాటు విజయవాడలో నేర సామ్రాజ్యం నడిపిన వ్యక్తి విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ బాబుకు పదవిలో కొనసాగే అర్హత లేదని వైస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎనిమిదవ రోజు సంఘీభావయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజక వర్గంలో ఆయన పాదయాత్ర సాగింది. ఈ సందర్బంగా తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ బాబుపై విమర్షలు ఎక్కుపెట్టారు. 30 ఏళ్ల క్రితం రామకృష్ణ బాబు విజయవాడలో వంగవీటి మోహన్‌ రంగాను హత్య చేసి పారిపోయి విశాఖపట్నం వచ్చాడని అన్నారు. భూకబ్జాలు, మద్యం సిండికేట్‌ చేసి విశాఖ ప్రజలను దోచుకుంటున్నాడని, విశాఖలో జరుగుతున్న ప్రతి భూకబ్జాలో ఆయన ప్రమేయం ఉందని ఆరోపించారు. 

రామకృష్ణబాబు 9 ఏళ్లలో ఏనాడైనా ప్రజలకు అండగా ఉన్నారా, వారికి సేవ చేశారా అని విజయసాయి రెడ్డి నిలదీశారు. స్వప్రయోజనాల కోసం మీరు చేస్తున్న దారుణాలను ప్రజలు నిత్యం గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. గత ఎన్నికల్లో రైతు బజార్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జోడుగుళ్లపాలెంలో రజకులకు దోభీ ఘాట్ పనులను పూర్తి చేస్తామని చెప్పిన అధికార పార్టీ ఎమ్మెల్యే నాలుగేళ్లైనా వాటిని పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎమ్మెల్యే చేసేది ఒక్కటేనని, జీవీఎంసీ ఏర్పాటు చేసిన కొలాయిలను ప్రారంభిండం తప్పితే చేసింది ఏమీలేదని దుయ్యబట్టారు.

100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆంధ్రా యూనివర్సిటీలో రోజువారి కూలీ జీతం తీసుకుంటూ పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని చెప్పిన హామీని మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు మర్చిపోలేదని విజయసాయి రెడ్డి అన్నారు. సింహాచలం దేవస్థానం భూముల్లో 50ఏళ్లకు పైగా ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వారికి పట్టాలు ఇప్పిస్తామన్న ఎమ్మెల్యే తర్వాత ఏమీ చేయలేక పోయారని ఆయన మండిపడ్డారు. 9 ఏళ్లుగా శాసన సభ్యులుగా ఉన్న రామకృష్ణ బాబు ఒక్కసారంటే ఒక్కసారైనా విశాఖ తూర్పు ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. జాలరీ పేటలో మత్సకారులకు ఇళ్లు ఇప్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు.

హుదూత్‌ తుపాన్‌లో బాధితులకు ఇప్పటి వరకూ నష్టపరిహారం ఇప్పించడంలో విఫలమయ్యారని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. 2007లో దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి విమ్స్‌ విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌కు 110 ఎకరాలు కేటాయించారని, 1300 పడకలు, 18 సూపర్ స్పెషాలిటీ సర్వీస్‌ అందించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు కేబినెట్‌ సమావేశంలో 100 కోట్లు నిధులు ఇస్తామని తీర్మాణం చేశారని, కానీ చిల్లిగవ్వ కూడా విదల్చలేదని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు