డేటా చోరీ.. దేశంలోనే పెద్ద సాబోటేజ్‌ క్రైమ్‌

5 Mar, 2019 21:44 IST|Sakshi

హైదరాబాద్‌: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు చేసిన డేటా చోరీ స్కాం అనేది దేశంలోనే అతి పెద్ద సైబర్‌ సాబోటేజ్‌ క్రైమ్‌ అని వర్ణించారు. రహస్యంగా ఉండాల్సిన సమాచారాన్ని బజారులో పడేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇంకా ఏయే వ్యవస్థల్లోకి టీడీపీ ప్రభుత్వం చొరబడిందో తేల్చాల్సి ఉందన్నారు. దొంగిలించిన సమాచారంతో ఏపీ ప్రజలు సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బాబు నాశనం చేశాడని ఆరోపించారు. తండ్రీకుమారులు చేసిన డేటా బ్రీచ్‌ సాధారణ నేరం కాదని వ్యాఖ్యానించారు. ఓట్ల తొలగింపు ద్వారా ఏపీలో విజయం సాధించి ఉంటే భవిష్యత్తులో తమ చెంచాను దేశ ప్రధానిగా చేసుకునే కుట్రకు పాల్పడేవారేనని అన్నారు.

అమెరికా ఎన్నికల ఫలితాలను రష్యా మ్యానిపులేట్‌ చేసిందనే వార్తలే చంద్రబాబుకు ప్రేరణ కలిగించి ఉండవచ్చునని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయ పోరాటం వదిలి చంద్రబాబు, ప్రజలపై కసి తీర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మామను వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నాడు.. ఇప్పుడు ప్రజల డేటాను దొంగిలించి వారి సర్వస్వం దోచుకునే ప్లాన్‌ వేశాడని ఆరోపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి గెలుపుపైనా అనుమానం కలుగుతోందని అన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు.

పోటీ చేసేందుకూ అభ్యర్థులూ కష్టమే!
నోటిఫికేషన్‌ వెలువడక ముందే టీడీపీ నాయకత్వం ఓటమిని ఓప్పేసుకుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం కూడా కష్టంగా ఉందని ఎద్దేవా చేశారు. మొన్నటి దాకా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నవరత్నాలను కాపీ కొట్టి ప్రజలను ఏమార్చవచ్చని చూశారు... ఎవరూ నమ్మకపోయేసరికి దొంగదారులు వెతుకుతున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు