ఆ నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయండి

4 Jan, 2018 01:36 IST|Sakshi

     లోక్‌సభ స్పీకర్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వినతి

     రాజ్యసభ చైర్మన్‌లా తక్షణ చర్యలు తీసుకోండి

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ స్పీకర్‌కు విన్నవించింది. రాజ్యసభ చైర్మన్‌ ఇటీవల అనర్హత పిటిషన్లపై 90 రోజుల్లోపే పరిష్కరించిన రీతిలో తమ పిటిషన్లను పరిష్కరించాలని విన్నవించింది.

ఈ మేరకు పార్టీ విప్‌ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ఇక్కడ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఒక లేఖ ఇచ్చారు. ‘స్పీకర్‌ కార్యాలయంపై మాకు అపారమైన గౌరవం ఉంది. అయితే రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలన్న మా విన్నపాన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతోంది. 2014 సాధారణ ఎన్నికల్లో నంద్యాల నుంచి మా పార్టీ టికెట్‌పై గెలుపొందిన ఎస్పీవై రెడ్డి గెలిచిన వారం రోజులకే ఆంధ్రప్రదేశ్‌లోని అధికారపార్టీ అయిన టీడీపీలో చేరారు.

ఆయన పార్టీ మారినందున రాజ్యాంగంలోని పదో షెడ్యూలును అనుసరించి ఆయనపై అనర్హత వేటు వేయాలని మేం పిటిషన్‌ దాఖలు చేశాం. మా పార్టీ టికెట్‌పై అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కొత్తపల్లి గీత పార్టీ ఫిరాయింపునకు పాల్పడినందున ఆమె సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని 14 డిసెంబరు 2016న పిటిషన్‌ దాఖలు చేశాం. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి మా పార్టీ టికెట్‌పై గెలుపొందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లో చేరడంతో డిసెంబరు 14, 2016న అనర్హత పిటిషన్‌ దాఖలు చేశాం. అక్టోబరు 17, 2017న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మా పార్టీ నుంచి టీడీపీలో చేరడంతో అనర్హత పిటిషన్‌ దాఖలు చేశాం.

కానీ వారిపై ఎలాంటి చర్యలూ లేవు’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు అధికార టీడీపీ వైఎస్సార్‌సీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని బహిరంగంగా తమ పార్టీలో చేర్చుకుందని, ఇందులో నలుగురిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ఫిరాయింపులకు పరాకాష్టని తెలిపారు. 

మరిన్ని వార్తలు