ఏపీ విభజన ఏకపక్షమే

7 Aug, 2019 04:32 IST|Sakshi

మనీష్‌ తివారీ ప్రసంగాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించిందని, ఏపీ చట్టసభల అభిప్రాయాన్ని పరిగణనలోకితీసుకోలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ చేసిన ప్రసంగాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీలు తిప్పికొట్టారు. మనీష్‌ తివారీ ప్రసంగిస్తూ ఆర్టికల్‌ 3 అంటే మీకు మీరే చర్చించుకుని వచ్చి ఒక రాష్ట్ర సరిహద్దులు మార్చడమో, రెండుగా విభజించడమో కాదని, శాసనసభ, శాసనమండలిలో చర్చించి వాటి అభిప్రాయం తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ లేచి ఆంధ్రప్రదేశ్‌ చట్టసభల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా యూపీఏ ఏపీని ఏకపక్షంగా విభజించిందని మండిపడ్డారు. దీనిపై మనీష్‌ తివారీ స్పందిస్తూ ‘విభజన బిల్లు తెచ్చే ముందు అనేక చర్చలు జరిగాయి. ఏపీ చట్టసభల్లోనూ చర్చ జరిగిన తరువాతే తెలంగాణ ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు అందరూ లేచి ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌ చట్టసభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేశారని గుర్తుచేశారు. 

అసెంబ్లీ ఆమోదించిందనడం వాస్తవ విరుద్ధం
ఆంధ్రప్రదేశ్‌ విభజనను ఏపీ అసెంబ్లీ సమర్థించిందంటూ ఓ సభ్యుడు మాట్లాడారని, ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. జమ్మూకశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనను ఉమ్మడి శాసనసభ మూడింట రెండొంతుల మెజారిటీతో తిరస్కరించిందని గుర్తుచేశారు. విభజనపై సంప్రదింపులకు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ను ఏర్పాటుచేసినప్పటికీ నివేదికను తప్పుగా అన్వయించి, రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. ఈ విషయంపై తనకు సాధికారత ఉందని, తానే విభజనపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసినట్టు తెలిపారు. ఇప్పటికీ ఆ కేసు పెండింగ్‌లో ఉందని వివరించారు.  

మరిన్ని వార్తలు