బలవంతంగా ఎంపీల తరలింపు.. తీవ్ర ఉద్రిక్తత!

11 Apr, 2018 11:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం మొక్కవోని సంకల్పంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డిలను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న యువ ఎంపీలు మిథున్‌‌, అవినాష్‌ ఆరోగ్య పరిస్థితి బుధవారం తీవ్రంగా విషమించింది. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళన వ్యక్తం చేసిన వైద్యులు... తక్షణమే దీక్ష విరమించాలని వారికి సూచించారు. అందుకు ఎంపీలు నిరాకరించడంతో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగింది. వైఎస్సార్‌సీపీ నేతలు ప్రతిఘటిస్తున్నా.. దీక్షలోని ఎంపీలను బలవంతంగా ర్యాపిడ్‌ యాక‌్షన్‌ ఫోర్స్‌ అక్కడి నుంచి రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఏపీ భవన్‌లో ప్రత్యేక హోదా నినాదాలు హోరెత్తాయి. ఎంపీల తరలింపును అడ్డుకోవడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నించాయి. ఎంపీలను తరలిస్తున్న అంబులెన్స్‌కు అడ్డంగా కూర్చొని కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో పోలీసు బలగాలకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులను బలవంతంగా ఈడ్చేసి.. ఉద్రిక్త పరిస్థితుల నడుమ బలగాలు అంబులెన్స్‌ను ముందుకు తరలించాయి.

వైద్యుల పరీక్షలు..!
ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న యువ ఎంపీలు మిథున్‌, అవినాష్‌ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్న నేపథ్యంలో రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు బుధవారం ఉదయం వారికి పరీక్షలు నిర్వహించారు. వీరిద్దరి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని, రక్తంలో చక్కెరస్థాయి క్రమంగా ప్రమాదస్థాయికి పడిపోతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్‌రెడ్డి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ 73కు పడిపోగా, మరో ఎంపీ మిథున్‌రెడ్డి బ్లడ్‌షుగర్‌ లెవల్స్‌ 71కి పడిపోయింది. అవినాష్‌రెడ్డి బీపీ లెవల్స్‌ 80/60 మధ్య ఉండగా.. మిథున్‌రెడ్డి బీపీ లెవల్స్‌ 110/70గా ఉన్నాయి. ఎంపీల శరీరంలోని కీటోన్స్‌ సంఖ్య కూడా ప్రమాదకరంగా ఉంది. షుగర్‌ లెవల్స్‌ తగ్గిపోయిన నేపథ్యంలో ఇద్దరు యువ ఎంపీలు దీక్ష కొనసాగిస్తే ప్రమాదకరమని, శరీరంలోని ఇతర అవయవాలు, మెదడుపై ప్రభావం చూసే అవకాశముందని వైద్యులు హెచ్చరించారు. దీక్ష విరమించాలని ఎంపీలను కోరినట్టు వారు తెలిపారు. ఇద్దరు ఎంపీలు డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నారని, తక్షణం ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్‌ ఎక్కించాల్సిన అవసరముందని ఆర్‌ఎంఎల్‌ వైద్యులు సూచించారు. కానీ, ఎంపీలు చెక్కుచెదరని సంకల్పంతో తమ దీక్ష విరమించేది లేదంటూ వైద్యుల సూచనను తిరస్కరించారు. దీంతో వైద్యులు ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చారు.

మరిన్ని వార్తలు