క్షీణించిన వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం

9 Apr, 2018 08:50 IST|Sakshi

ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా దీక్షలో కూర్చున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

డీ హైడ్రేషన్, షుగర్ లెవల్స్ పడిపోయాయన్న వైద్యులు

సుబ్బారెడ్డిని బలవంతంగా ఆస్పత్రికి తరలించిన పోలీసులు

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరి లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని వైద్యుల సూచన మేరకు సిబ్బంది సాయంతో పోలీసులు బలవంతంగా రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్‌ ఎక్కిస్తున్నారు. తొలుత ఫ్లూయిడ్స్‌ వద్దని, దీక్ష కొనసాగిస్తానని సుబ్బారెడ్డి చెప్పారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి షుగర్ లెవల్స్ 66 పాయింట్లకు పడిపోయి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో వైద్యులు ఫ్లూయిడ్స్‌ ఎక్కించి సుబ్బారెడ్డి ఆరోగ్యం మెరుగు పరిచేందుకు యత్నిస్తున్నారు. సోమవారం ఉదయం సుబ్బారెడ్డిని పరీక్షించిన వైద్యులు ఆయన పూర్తిగా డీహైడ్రేషన్‌కు గురయ్యారని తెలిపారు. 

దీక్ష విరమించాలని వైవీ సుబ్బారెడ్డిని ఆయన భార్య కన్నీళ్లతో ప్రాధేయపడ్డారు. వైద్యులు, కుటుంబసభ్యులు చెప్పినా తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా దీక్ష కొనసాగిస్తున్న సుబ్బారెడ్డిని వైద్యుల సూచన మేరకు సిబ్బంది సాయంతో పోలీసులు బలవంతంగా రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆయనను ఆస్పత్రికి తరలించే సమయంలో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాగా, తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఇద్దరు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాదరావులను ఇప్పటికే బలవంతంగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీకి సంజీవని లాంటి హోదా సాధన కోసం 73 ఏళ్ల వయసులో మేకపాటి, 64ఏళ్ల వయసులో వరప్రసాద్‌లు ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. 

నాలుగోరోజుకు చేరిన వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ దీక్ష
ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరి లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం నాలుగోరోజుకు చేరింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డిలు కొనసాగిస్తున్న దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. పలు పార్టీల నేతలు దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజా సంఘాలు, విద్యార్థులు వైఎస్సార్‌సీపీ ఎంపీల దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఢిల్లీలో సోమవారం ఉదయం ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎంపీల దీక్షాస్థలి వద్ద మరోసారి టెంట్లు కూలిపోయాయి. ఎంపీలు దీక్ష చేపట్టిన రోజు సైతం ఢిల్లీలో భారీగా వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఏపీ భవన్‌లో మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు దీక్ష కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు