క్షీణిస్తున్న మిథున్‌, అవినాశ్‌ ఆరోగ్యం

10 Apr, 2018 09:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మొక్కవోని సంకల్పంతో ముందుకుసాగుతోంది. ఐదుకోట్ల ఆంధ్రుల కోసం, విభజన హక్కుల సాధన కోసం అన్నపానాలు మరిచి.. ఎంపీలు ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి కొనసాగిస్తున్న దీక్ష మంగళవారం ఐదోరోజుకు చేరుకుంది.  ఐదు రోజులుగా దీక్షలో ఉండటంతో మిథున్‌, అవినాశ్‌ బాగా నీరసించిపోయారు. దీంతో వారికి డాక్టర్లు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు.

పడిపోయిన షుగర్‌ లెవల్స్‌..
దీక్ష కొనసాగిస్తున్న ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. కటోర దీక్ష చేస్తున్న ఈ ఇద్దరు యువనేతల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ పడిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. అవినాశ్‌రెడ్డి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ 78​కి పడిపోయాయి. ఒక్కరోజులోనే ఆయన షుగర్‌ లెవల్స్‌ 94 నుంచి 78కి పడిపోయాయి. మిథున్‌రెడ్డి శరీరంలోనూ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ 80కి పడిపోయాయి. ఒక్కరోజులోనే ఆయన షుగర్‌ లెవల్స్‌ 82 నుంచి 80కి పడిపోయాయి.

ప్రాణాలను పణంగా పెట్టి హోదా సాధనే లక్ష్యంగా నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు సర్వత్రా మద్దతు వెల్లువెత్తుతోంది. జాతీయస్థాయిలో వివిధ పార్టీల నాయకులు ఎంపీల దీక్షకు మద్దతు పలుకుతున్నారు. దీక్షాస్థలిని సందర్శించి.. ప్రత్యేక హోదా పోరాటానికి అండగా నిలుస్తున్నారు. ఎంపీల దీక్ష నేపథ్యంలో టీడీపీ నేతలు ఇకనైనా కళ్లుతెరిచి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి దీక్ష చేయాలని, అందరూ కలిసికట్టుగా పోరాడితే కేంద్రం దిగివస్తుందని అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వంపై 13సార్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినా లోక్‌సభలో చర్చకు రాలేదని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, వారు దిగిరాక తప్పదని అన్నారు. తమ శక్తిమేరకు ప్రత్యేక హోదా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. జల్లికట్టు ఉద్యమంలో అందరూ కలిసికట్టుగా పోరాటం చేయడంతో సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెట్టాల్సి వచ్చిందని, అదేవిధంగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి తమతో కలిసి రావాలని, అందరూ కలిసికట్టుగా పోరాడితేనే కేంద్రం దిగివస్తుందని మిథున్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు