‘బాబుకు ఏపీ ప్రజలు కూడా బుద్ధి చెబుతారు’

11 Dec, 2018 14:17 IST|Sakshi

ఢిల్లీ: తెలంగాణ ప్రజలు పరిపక్వతతో మంచి తీర్పు ఇచ్చారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ.. నాయకులు దారి తప్పినా ప్రజలు సరైన విధంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏపీ ప్రజలు కూడా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎత్తుగడలు, మోసాలతో నారా చంద్రబాబు ప్రజలను వంచించారని విమర్శించారు.

బాబు విన్యాసాలు బెడిసికొట్టాయి: ఉమ్మారెడ్డి
చంద్రబాబు విన్యాసాలు తెలంగాణాలో బెడిసికొట్టాయని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అనైతిక పొత్తు వల్ల నష్టపోయామని కాంగ్రెస్‌, టీడీపీలోనే అనేక మంది నాయకులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. పొత్తులు లేకుండా చంద్రబాబు రాజకీయాలు చేయలేదని మండిపడ్డారు. పొత్తుకు పరాకాష్టగా కాంగ్రెస్‌తో జత కట్టారని దుయ్యబట్టారు.

హోదా వచ్చే వరకు పోరాటం ఆగదు: వైవీ

ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో తొలి రోజునే ధర్నాకు దిగామని, ఎంపీలందరూ రాజీనామా చేసి నిరవధిక దీక్షకు దిగి పోరాటం చేశామని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్‌సీపీ 25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుదని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఓటమిని ఏ పార్టీ కూడా రక్షించలేదన్నారు. ఆయనకు ఏ పార్టీ కూడా మద్ధతిచ్చే అవకాశం లేదన్నారు.


తెలంగాణాలో ఉన్న అన్ని పార్టీలతో కలిసినా ప్రజలు చంద్రబాబును, కాంగ్రెస్‌ను ఓడించారని ఎద్దేవా చేశారు. సీబీఐ నుంచి కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కొత్తపాట పాట పాడుతున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే చంద్రబాబును ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, సైకిల్‌ రెండు చక్రాల్లో ఇప్పటికే గాలిపోయిందని ఎద్దేవా చేశారు.

కర్ణాటకలో గెలిస్తే నా వల్లే గెలిచావని చెప్పావు బాబూ!
స్పష్టమైన ఆధిక్యంతో గెలిచిన  టీఆర్‌ఎస్‌ పార్టీకి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో గెలిస్తే నావల్లే గెలిచారని చంద్రబాబు జబ్బలు చరుచుకున్నారని చెప్పారు. తెలంగాణలోనూ ఓటమికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా మునిగిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూడా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు