మేడం గారు.. ఇవిగో రాజీనామాలు

6 Apr, 2018 12:31 IST|Sakshi

హోదా విషయంలో ప్రభుత్వాలు మోసం చేశాయి

అందుకు నిరసనగానే రాజీనామాలు.. తక్షణమే ఆమోదించండి

లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీలు

ఏపీ భవన్‌లో నిరవదిక నిరాహార దీక్ష

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. శుక్రవారం పార్లమెంట్‌ నివరధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు స్పీకర్‌ను కలుసుకుని, రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రూపొందించిన రాజీనామాలను పరిశీలించిన సుమిత్రా మహాజన్‌.. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు సూచించారు. అందుకు సున్నితంగా తిరస్కరించిన ఎంపీలు.. రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. రాజీనామాల తర్వాత నేరుగా ఏపీ భవన్‌కు బయలుదేరిన ఎంపీలు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చోనున్నారు.

ప్రజల ఆకాంక్షల మేరకే రాజీనామాలు: ఎంపీ పదవులకు రాజీనామాలపై పునరాలోచించుకోవాలన్న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రాకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఏపీ పరిస్థితులను వివరించారు. ‘‘మేడం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదానే సంజీవని. హోదా లేకుండా రాష్ట్రం మనలేదు. అందుకే విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా హోదా ఇస్తామని ప్రకటించారు. కానీ ప్రభుత్వాలు తమ హామీలను నెరవేర్చలేదు. హోదా కోసం గడిచిన నాలుగేళ్లలో వైఎస్సార్‌సీపీ చేయని పోరాటంలేదు. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సైతం ఆమరణ దీక్ష చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా చర్చకు రాకుండాపోయింది. మేడం, ఏపీ ప్రజల ఆకాంక్షల మేరకే మేం రాజీనామాలు చేశాం. దయచేసి మా రాజీనామాలను ఆమోదించండి..’ అని వైఎస్సార్‌సీపీ ఎంపీలు అన్నారు.

వైఎస్సార్‌ సీపీ ఎంపీల రాజీనామా లేఖలు ఇవే..

మరిన్ని వార్తలు