‘టీడీపీ తరఫున పోలీసులే డబ్బులు పంచుతున్నారు’

29 Mar, 2019 12:11 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఎన్నికల్లో గెలవాలనే కుయుక్తులతో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. శుక్రవారమిక్కడ విలేకరులతో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ పేరుతో దొంగ లెటర్‌ హెడ్‌ సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో పాటుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేరుతో డూప్లికేట్‌ ట్విటర్‌ అకౌంట్‌ సృష్టించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో తమ పార్టీకి వస్తున్న జనాదరణ ఓర్వలేక అయోమయం సృష్టించేందుకు గుర్తులు మారినట్లుగా ప్రచారం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ తరఫున ఏకంగా పోలీసులే డబ్బులు పంచుతూ దొరికిపోయారని.. దీంతో పోలీసు యూనిఫార్మ్‌పై ఉన్న గౌరవం పోయిందని నాగిరెడ్డి విమర్శించారు. అంతేకాకుండా బ్యాలెట్లన్నీ తమకే అప్పచెప్పాలని అంటున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఏ వ్యవస్థ అయినా తన చెప్పు చేతల్లో నడవాలని చంద్రబాబు భావిస్తారని.. ఎన్నికల సంఘం అంటే కూడా ఆయనకు లెక్కేలేదని విమర్శించారు. అందుకే ఈసీ ఆదేశాలను బేఖాతరు చేశారని.. అయితే ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆయన ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఇకనైనా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని హితవు పలికారు.(చదవండి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు)

మరిన్ని వార్తలు