‘ఉద్యోగాల భర్తీపై శ్వేత పత్రం విడుదల చేయాలి’

24 Aug, 2018 19:42 IST|Sakshi
నిరుద్యోగ గర్జనలో మాట్లాడుతున్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులను, నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ గర్జన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎర్పడిన తరువాత ఎన్ని ఉద్యోగాలు కల్పించారో, ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అయ్యయో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరుతో టీఆర్‌ఎస్‌ మోసానికి పాల్పడుతోందని ఆరోపించారు.

తెలంగాణలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, పేర్లు మార్చడం తప్ప టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని.. అందుకు టైం షెడ్యూల్‌ విడుదల చేయాలని కోరారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తామని చెప్పడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. పాతిక లక్షల మందితో టీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్‌లు పెట్టడం కాదు.. పాతిక లక్షల మందికి నియామకాలు ఎప్పుడో చేపడతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీకైనా ఓటమి తప్పదని సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణలో తిరగనీయకుండా చేయాలన్నారు.
 

మరిన్ని వార్తలు