నవ వసంతంలోకి వైఎస్సార్‌ సీపీ

12 Mar, 2019 08:17 IST|Sakshi

సాక్షి, విజయనగరం: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌(వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌) పార్టీ ఆవిర్భవించి ఎనిమిది వసంతాలు పూర్తవుతోంది. మంగళవారానికి తొమ్మిదవ వసంతంలోకి ఆ పార్టీ అడుగుపెడుతుతోంది. గడచిన ఎనిమి దేళ్లలో ఆ పార్టీ నేతలు ఏనాడూ ప్రజాక్షేత్రాన్ని వీడలేదు. అధికారపార్టీ నుంచి ఎదువుతున్న అనేక ఇబ్బందులను, కష్టనష్టాలను ఓర్చుకుంటూ జనం సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూ ప్రజల మధ్యనే గడిపారు. ఆ క్రమంలో అనేక సమస్యల నుంచి ప్రజలను కాపాడగలిగారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులకు చేరేలా చేశారు. ఈ నేపధ్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధపడుతున్నారు.

మహానేత ఆశయాలే ఆలంబనగా...
స్వార్థ రాజకీయ శక్తుల కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ, ప్రజా సంక్షేమమే ఊపిరిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించింది. తన తండ్రి మహానేత వైఎస్‌ రాజశేఖరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుం బాలను ఓదార్చడానికి కాంగ్రెస్‌ అధిష్టానం అడ్డుతగిలితే, ఆ పార్టీని వదిలి బయటకు వచ్చి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పార్టీని స్థాపించారు. ఆ సమయంలో తన తల్లి, తానూ మాత్రమే ఉన్నప్పటికీ జగన్‌ నమ్మిన సిద్ధాంతాలే ఆయన వెంట అశేష ప్రజానీకం, ఉద్ధండులైన రాజకీయ నేతలు నడిచేలా చేశాయి. ఆయన అందించిన స్ఫూర్తితో జిల్లాలోనూ పార్టీ శ్రేణులు అనేక ఉద్యమాలు చేపట్టాయి.

ఉద్యమాల్లో జిల్లా నేతలు.. 
సమైక్యాంధ్ర ఉద్యమంలో జిల్లా నేతలు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం  ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌ను భుజానికెత్తుకుని ఉవ్వెత్తున నినదించారు. ఊరూవాడా నిరాహారదీక్షలు, నిరసనలు చేపట్టారు. అగ్రిగోల్డ్‌ బాధితుల పక్షాన నిలిచి వారికి న్యాయం జరిపించేందుకు పోరాడారు. జిల్లాలో నెలకొన్న అనేక సమస్యలపై ఆందోళనలు నిర్వహించారు. జ్వరాల బారిన పడి జిల్లా విలవిల్లాడుతున్నప్పుడు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తాగునీటికి జనం కటకటలాడుతున్నప్పుడు మున్సిపాలిటీలను ముట్టడించారు. నీళ్లిచ్చేంత వరకూ వదలకుండా నిరసన తెలిపారు. పార్వతీపురం మండలం బడే దేవరకొండపై అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించారు. చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌లో రూ. 1.70కోట్లు మాయంపై పోరాడి విజయం సాధించారు. 

ఐక్యతకు మారుపేరుగా...
జిల్లాలో పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో పార్టీ శ్రేణులు ఏకతాటిపై నడిచారు. తమ అధినేతను ఆదర్శంగా తీసుకుని నవరన్నాలు, రావాలి జగన్, కావాలి జగన్‌ కార్యక్రమాలు చేపట్టి, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ మోసాలను ప్రజలకు వివరిస్తూ తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు చేసే మంచి గురించి వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల తొలగింపు, దొంగ సర్వే వంటి కుట్రలను అడ్డుకుంటున్నారు. దానికి ప్రతిఫలంగా అధికారపార్టీ పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులను భరిస్తున్నారు. ఏది ఏమైనా రాజన్న రాజ్యం మరలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీతో తీసుకురావాలని ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.  

>
మరిన్ని వార్తలు