అవిశ్వాస తీర్మానానికి సిద్ధం

13 Mar, 2018 01:48 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ఏప్రిల్‌ 6న రాజీనామాలు చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం సోమవారం పార్లమెంటులో ఆందోళన కొనసాగించారు. ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రత్యేక హోదా కోసం నినదిస్తూ ధర్నా నిర్వహించారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వి.వరప్రసాదరావు, పి.వి.మిథున్‌రెడ్డి ఈ ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ.. ‘కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. పలు పార్టీలు మద్దతు ఇస్తాయని ఆశిస్తున్నాం. మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతిస్తామని చెప్పారు. మేం పెట్టినా వాళ్లు ఇవ్వాలని అడిగారు. మా పోరాటంలో భాగంగా వచ్చే నెల 6వ తేదీన రాజీనామాలు సమర్పిస్తాం. అవిశ్వాస తీర్మానానికి వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.

టీడీపీ కూడా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాం. ఏపీకి ప్రత్యేక హోదా ప్రాణవాయువు. పోరాటం ద్వారానే  హోదా సాధించుకుంటాం.మా పోరాటం ఫలిస్తుందని నమ్ముతున్నాం’ అని పేర్కొన్నారు. ధర్నా అనంతరం ఉభయ సభల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. లోక్‌సభ ప్రారంభం కాగానే సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, పి.వి.మిథున్‌రెడ్డి వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు విభజన హామీలపైనే టీడీపీ సభ్యులు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసి తర్వాత  లోక్‌సభ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. రెండు సభల్లో ఆందోళనలతో సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.

మరిన్ని వార్తలు