కలసి సాగుదాం

26 May, 2019 02:31 IST|Sakshi
వైఎస్‌ జగన్‌ దంపతులకు వస్త్రాలను అందజేస్తోన్న కేసీఆర్‌ దంపతులు

ఇరు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కేసీఆర్, జగన్‌ ఆకాంక్ష

జగన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆత్మీయ స్వాగతం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా కలసి ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైఎస్‌ జగన్‌కు ప్రగతి భవన్‌లో అపూర్వ స్వాగతం లభించింది. శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలసిన అనంతరం నేరుగా ప్రగతిభవన్‌ చేరుకున్న జగన్‌ దంపతుల కారు వద్దకు సీఎం కేసీఆర్‌ స్వయంగా వచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు.

జగన్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ప్రగతి భవన్‌లోనికి తీసుకెళ్లారు. లోపల అప్పటికే వేచి ఉన్న తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలను కేసీఆర్‌.. వైఎస్‌ జగన్‌కు పరిచయం చేశారు. ఏపీ శాసనసభ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌ను కేసీఆర్‌ అభినందించి మిఠాయి తినిపించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన జగన్‌ను శాలువాతో సన్మానించారు. హంసవీణ (కరీంనగర్‌ పిలిగ్రీ) జ్ఞాపికను బహూకరించారు. జగన్‌ దంపతులకు కేసీఆర్‌ దంపతులు కొత్త వస్త్రాలు అందించి సత్కరించారు.

ఏపీ ముఖ్యమంత్రి బాధ్యతల్లో విజయవంతం కావాలని జగన్‌ను దీవించారు. జగన్‌ సతీమణి వైఎస్‌ భారతీరెడ్డికి కేసీఆర్‌ సతీమణి శోభారాణి, కేటీఆర్‌ సతీమణి శైలిమ స్వాగతం పలికారు. వైఎస్‌ భారతీరెడ్డి కొద్ది సేపువారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 30న విజయవాడలో నిర్వహించే ప్రమాణ స్వీకారోత్సవానికి తప్పనిసరిగా రావాలని కేసీఆర్‌ను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆహ్వానించారు. జగన్‌ వెంట ఏపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఆదిమూలపు సురేశ్‌ ఉన్నారు.

కేసీఆర్‌తో పాటు జగన్‌కు స్వాగతం పలికిన వారిలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, వి.శ్రీనివాసగౌడ్, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఎంపీ జె.సంతోశ్‌కుమార్, మాజీ ఎంపీలు బి.వినోద్‌ కుమార్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌ రెడ్డి తదితరులున్నారు. 

జగన్‌కు కేసీఆర్‌ స్నేహ హస్తం...

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని, ఆంధ్రప్రదేశ్‌తో కూడా అదే విధానం అవలంబిస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాల విషయంలో నేతలిద్దరూ కొద్దిసేపు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌తో మంచి సంబంధాలు నెలకొల్పుదామని కేసీఆర్‌ స్నేహహస్తం అందించారు.

‘‘ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని మేము మొదటి నుంచి భావిస్తున్నాం. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశా. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌–మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై నేనే చొరవ తీసుకుని మాట్లాడా. లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌ మా విధానమని చెప్పా. వివాదాలు పరిష్కరించుకోవడంతో రెండు రాష్ట్రాలకు మేలని అన్నా. దీంతో సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చింది. ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నాం.

ఏపీతోనూ ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది మా విధానం. రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దాం’’అని కేసీఆర్‌ అన్నారు. ‘‘గోదావరి నది నుంచి ప్రతీ ఏటా 3,500 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ గరిష్టంగా 700–800 టీఎంసీలే వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్‌ వాడుకునే వీలుంది. ప్రకాశం బ్యారేజీ ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్‌ రాయలసీమను సస్యశ్యామలం చేయొచ్చు. కేవలం 2 లిఫ్టులతో గోదావరి నీళ్లను సీమకు పంపొచ్చు. గోదావరి నీళ్లను వాడుకుని ఆంధ్రప్రదేశ్‌ రైతులకు సాగునీరు ఇవ్వొచ్చు’’అని సూచించారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సహా సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇద్దరు నాయకులు నిర్ణయించారు.   

మరిన్ని వార్తలు