సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు: పిల్లి సుభాష్‌

22 Jul, 2020 14:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు, ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. బీసీ వర్గానికి చెందిన మాకు రాజ్యసభలో చోటు కల్పించడం అరుదైన సన్నివేశం. కలలో కూడా ఊహించనిది జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.

మా అందరిపైనా ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. విభజన చట్టం లో హామీలు ఇంకా పరిపూర్ణంగా అమలు కాలేదు .విభజన చట్టం అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం.  బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఆంధప్రదేశ్‌లో రూ.40 వేల కోట్లు పైగా ఖర్చు పెట్టడం ఆల్‌టైమ్‌ రికార్డు. వ్యవసాయ రంగానికి రూ.19 వేల కోట్ల రూపాయలు కేటాయించాం. విద్యా, వైద్య రంగాల మీద పెట్టిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా సీఎం వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాల హృదయంతో ఏపీని ఆదుకోవాలి’ అని పేర్కొన్నారు. కాగా, వైఎస్సార్‌సీపీ రాజ్యసభకు ఎన్నికైన పరిమళ్‌ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
(మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ)

మరిన్ని వార్తలు