గెలుపే లక్ష్యం

22 Jan, 2019 13:28 IST|Sakshi
పార్టీ నాయకులతో సమీక్ష జరుపుతున్న గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ

జిల్లాలోని 17 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి

వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలు, పనితీరుపై సమీక్ష

రెండు రోజులపాటు నాయకులతో బొత్స సత్యనారాయణ మంతనాలు

రావాలి జగన్‌...కావాలి జగన్‌  కార్యక్రమాన్ని విస్తృతంగా చేయాలని సూచన

సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ  గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ పార్టీ పార్లమెంటరీ జిల్లాల అ«ధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, నాయకుల పని తీరుపై నియోజకవర్గాల వారీగా గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేయడం లక్ష్యంగా, గ్రామస్థాయి నుంచి బూత్‌ కమిటీ సభ్యులు, పార్టీ అనుకూల సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ మండలాధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, ముఖ్యనేతలు ఏకతాటిపైకి రావాలని సూచిం చారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రధానంగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరించాలని సూచించారని నాయకులు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలను టీడీపీ మభ్యపెట్టే అవకాశం ఉన్నందున కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండి  సమర్థవంతగా తిప్పికొట్టాలని సూచించారు.

అభ్యర్థుల గెలుపే లక్ష్యం కావాలి
జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పార్టీ నాయకులకు బొత్స సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు. మొదటి దశలో తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల నేతలతో సమావేశం అయ్యారు. నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడి సమష్టిగా పార్టీ పటిష్టతకోసం కృషి చేయాలని కోరారు. జిల్లాలో నియోజ కవర్గాల వారీగా నాయకులతో సమీక్ష జరగనున్నట్లు పార్టీ నేతలకు వివరించారు. ఈ సమీక్షలో గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంట్‌ సమన్వయకర్త కిలారి రోశయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ  ఇన్‌చార్జులు, స్థానిక నేతలతో బొత్స సమీక్షించారు.

ఓటర్ల జాబితాలపై దృష్టి...
పట్టణాలు, గ్రామాల్లో ఓటర్ల జాబితాలను పరిశీలించి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల ఓట్లు ఉన్నాయో, లేవో, చూసుకోవాలని నేతలకు సూచించారు. దొంగ ఓట్ల పై దృష్టి సారించాలని, వాటిని తొలగించేలా చూడాలని పేర్కొన్నారని సమాచారం. ఓటర్ల జాబితాకు సంబంధించి మార్పులు, చేర్పులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటూ కీలకమేనని నాయకులకు వివరించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు