ఉప ఎన్నికలు వస్తే మాదే విజయం: వైఎస్సార్‌ సీపీ

1 Jul, 2018 19:30 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో కలసి టీడీపీ సాధించిందేమీ లేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్రధానమంత్రి మోదీపై సీఎం చంద్రబాబు నిందలు వేస్తున్నారని చెప్పారు. సోమవారం అనంతపురంలో వైఎస్సార్‌ సీపీ వంచన గర్జన దీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలతో పాటు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడారు.

మేకపాటి ఫైర్‌..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై కూడా చంద్రబాబు అదే పనిగా విమర్శలు చేస్తున్నారని మేకపాటి అన్నారు. తనకు తాను లౌకికవాదినని చెప్పుకుంటున్న చంద్రబాబు, బీజేపీతో వైఎస్‌ జగన్‌ స్నేహం చేస్తున్నారని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మోదీ గ్రాఫ్‌ తగ్గుతోందని భావించినందునే చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరకుంటారా అన్న చంద్రబాబు, దళిత తేజం పేరుతో ఏదో ఉద్దరిస్తామని చెప్పడం శోచనీయమన్నారు.

కేవలం ఎన్టీఆర్‌ అల్లుడు అనే ట్యాగ్‌ కారణంగానే చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు బాబు ఇచ్చిన 600లకు పైచిలుకు హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఈ విషయంపైనే చంద్రబాబు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటారని అన్నారు. ముందస్తు ఎన్నికల వస్తాయో, లేదో తనకు తెలియదని చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసమే పార్టీ నేతలు ఎంపీ పదవులకు రాజీనామాలు చేసినట్లు వెల్లడించారు. కేంద్రంపై వైఎస్సార్‌ సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టగానే చంద్రబాబు భయపడ్డారని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 25 ఎంపీ స్థానాలు గెలుపొంది వైఎస్సార్‌ సీపీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఎన్నికలకు వైఎస్సార్‌ సీపీ సిద్ధంగా ఉందని, ఉప ఎన్నికలు వచ్చినా కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదాను సాధిస్తాం : మిథున్‌ రెడ్డి
ఏపీ ప్రయోజనాలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌ సీపీ నేత మిథున్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాను వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో వైఎస్సార్‌ సీపీ సాధిస్తుందని చెప్పారు. కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. రైతులను కూడా దాగా చేశారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌కు అవకాశమిస్తే ఏపీ రూపురేఖలు మారుస్తారని చెప్పారు.

చంద్రబాబు భారీ అవినీతి : వరప్రసాద్‌
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్సార్‌ సీపీ నేత వరప్రసాద్‌ ఆరోపించారు. చంద్రబాబు ఓ జిత్తుల మారి నక్క అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. డబ్బు కోసమే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని అన్నారు. నాలుగేళ్లలో బాబు చేసిన అక్రమాలను కాగ్‌ తన రిపోర్టులో ఎత్తి చూపిందని చెప్పారు.

కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు దళితుల్ని తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. దేశవిదేశాలకు వెళ్లి చంద్రబాబు ఏపీకి ఏం తెచ్చారని ప్రశ్నించారు. విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. పేదవాళ్లను అవమానించే వ్యక్తికి సీఎంగా కొనసాగే అర్హత లేదని అన్నారు.

కడప ఉక్కుపై బాబు కన్ను
కడప స్టీల్ ఫ్యాక్టరీపై చంద్రబాబు కన్నుపడిందని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు. పోలవరం కాంట్రాక్టు పనులను తీసుకున్నట్లే కడప ఉక్కు పరిశ్రమను తన బినామీలకు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. టీడీపీ-బీజేపీ వంచనపై రేపు దీక్ష చేపట్టనున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు