జగనన్నతోనే జనరంజక పాలన

20 Mar, 2019 13:18 IST|Sakshi
వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోజా

నగరి : జగనన్నతోనే జనరంజకమైన పాలన వస్తుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మంగళవారం మున్సిపల్‌ పరిధిలోని 5వ వార్డులో ఆమె రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఆమెకు హారతులు పట్టి స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జగనన్న చేపట్టనున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా పేదవాడి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తామన్నారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం ఖర్చు కింద ఏడాదికి రూ.20 వేలు ప్రతి విద్యార్థికి అందిస్తామన్నారు. విద్యార్థులకు ఏడాదికి రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. గ్రామ సచివాలయం ఏర్పాటుచేసి స్థానిక యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, లంచం ఇవ్వకుండా పనులు చేసుకోవచ్చని తెలిపారు. వృద్ధులకు అంచెలంచలుగా పెన్షన్‌ నెలకు రూ.3 వేలు అందిస్తామన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కె.శాంతి, మాజీ చైర్మన్‌ కేజే కుమార్, వైస్‌ చైర్మన్‌ పీజీ నీలమేఘం, రామ్మూర్తి, ఏసు, పంజనాథన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు