‘పక్కా ప్రణాళికతో అవిశ్వాస తీర్మానం’

16 Mar, 2018 01:58 IST|Sakshi
బొత్స సత్యనారాయణ

సాక్షి, హైదారాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పునరుద్ఘాటించింది. అందుకే పార్లమెంట్‌లో ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టబోతున్నామని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ గురువారం తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అవిశ్వాసం పెడుతున్నట్టు చెప్పారు.

తమ ఎంపీలు అన్ని పార్టీల లోక్‌సభ సభ్యుల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారని వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి తాను ఎంతో చేస్తున్నానంటూ అసెంబ్లీలో మొసలికన్నీరు కార్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తే టీడీపీ భేషరతుగా తమకు మద్దతివ్వాలన్నారు.

‘పార్లమెంట్‌లో ఫైనాన్స్‌ బిల్లు ఆమోదం పొందింది. రేపో, ఎల్లుండో రాజ్యసభలో కూడా బిల్లు అప్రూవ్‌ చేస్తారు. తర్వాత సభ నిరవధిక వాయిదా పడుతుందనే ముందస్తు ప్రణాళికతో అవిశ్వాస తీర్మానాన్ని రేపే పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నామ’ని ఆయన వెల్లడించారు. అవిశ్వాసం తర్వాత కేంద్రం నుంచి ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ రాకుంటే తమ ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తారని చెప్పారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించుకుంటామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా 5 కోట్ల ఆంధ్రుల హక్కు అని తెలిపారు.

పవన్‌ కొత్తగా చెప్పిందేమీ లేదు
పవన్‌కల్యాణ్‌ జనసేన ఆవిర్భావ సభలో కొత్తగా చెప్పిందేమీ లేదని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టీడీపీ అవినీతిపై తాము గత నాలుగేళ్లుగా చేస్తున్న ఆరోపణలనే పవన్‌కల్యాణ్‌ మళ్లీ చెప్పారని విమర్శించారు. పాత సీసాలో కొత్త సారా మాదిరిగా పవన్‌ ప్రసంగం సాగిందని చురకలంటించారు. చంద్రబాబు తనయుడు లోకేష్‌ అవినీతి చేస్తున్నాడని గగ్గోలు పెడుతున్న పవన్‌ 2014లో టీడీపీకి ఎందుకు మద్దతిచ్చాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పవన్‌ మద్దతుతోనే రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి ఏరులై పారుతోందంటున్న పవన్‌.. టీడీపీ రాజకీయాలకు నైతిక బాధ్యత వహించాలని అన్నారు. దేవాలయ భూములు, రైతుల భూములు టీడీపీ అధికార దాహంలో కబ్జాకి గురయ్యాయని ఆరోపించారు. ఇప్పటికైనా టీడీపీ అవినీతిపై పవన్‌ నోరువిప్పడం సంతోషం కల్గించిందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు