‘బాబుకు దళితులు ఎందుకు ఓట్లు వేయాలి’

23 Feb, 2019 17:42 IST|Sakshi

విజయవాడ: బీసీ రైతు కోటయ్య మరణానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులదే ప్రధాన బాధ్యతని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారథి అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్ధసారధి మాట్లాడారు. కోటయ్య మరణంపై ఎందుకు సీబీసీఐడీ లేదా సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరపించడం లేదని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం రాను రానూ ప్రతి పథకం ఓట్ల ఆయుధంగా మార్చుకుంటోందని, ఇది రాజ్యాంగానికి గొడ్డలి పెట్టువంటిదన్నారు. ఓటర్ల జాబితా సవరణ క్యాంప్‌ను కూడా రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై ఈసీ వెంటనే స్పందించాలన్నారు.

ఐదేళ్లలో చేసిన భూకేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వ్యాఖ్యలపై కనీసం నోరువిప్పని చంద్రబాబుకు దళితులు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు.  టెండర్లు, భూకేటాయింపుల్లో చంద్రబాబు బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు కూడా సొంత వారికే కట్టబెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ లండన్‌ పర్యటనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి అద్దం పట్టాయని తీవ్రంగా విమర్శించారు.

మరిన్ని వార్తలు