‘చేతిలో సెల్‌ఫోన్‌ పెట్టి మభ్యపెడుతున్నారు’

14 Feb, 2019 16:50 IST|Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో రానురానూ శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మల్లాది విష్ణు గురువారం విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నివాసానికి, రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో జ్యోతి అనే మహిళ హత్యకు గురైనా, బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు.. నిందితులను ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు. రాజధాని అమరావతి వెళ్లాలంటే ప్రజలందరూ భయపడుతున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు రాజధాని అడ్డాగా మారిందని విమర్శించారు.

ఏపీలో మహిళలకు భద్రత, భరోసా ఉన్నాయా అని టీడీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మహిళలపై తరచూ దాడులు జరుగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు. డ్వాక్రా మహిళల చేతిలో సెల్‌ఫోన్‌ పెట్టి వారిని మభ్యపెడుతున్నారని విమర్శించారు. గతంలో దాడులు జరిగినపుడు గట్టి చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా అని సూటిగా అడిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగినా  స్పందన శూన్యమని ప్రభుత్వ వైఫల్యాన్ని తేటతెల్లం చేశారు.

మరిన్ని వార్తలు