‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే పవన్ లక్ష్యం’

28 Nov, 2018 16:41 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వెల్లంపల్లి విలేకరులతో మాట్లాడుతూ..పవన్‌ కల్యాణ్‌ రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్‌ అధికార పార్టీపై పోరాటం చేయాలి కానీ ప్రతిపక్షంపై కాదని హితవు పలికారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే పవన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. మీ(పవన్‌) అన్న చిరంజీవి పీఆర్‌పీని వదిలేస్తే మీరు ఎందుకు నడపలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. పవన్‌ మీ లాలూచీ అందరికీ అర్ధమవుతోందని అన్నారు.

కేజీ బేసిన్‌ గురించి విజయమ్మ వేసిన పిటిషన్‌లో ప్రస్తావించారని, కానీ ఆ విషయం పవన్‌కి ఇప్పటికి తెలియడం వింతగా ఉందన్నారు. కేజీ బేసిన్‌ విషయమై వైఎస్‌ జగన్‌ అనేకసార్లు పోరాటం చేశారని గుర్తు చేశారు. కేజీ బేసిన్‌ గురించి చంద్రబాబుతో పవన్‌ కలిసున్నంత కాలం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జగన్‌ సమైక్యాంధ్ర సభ పెట్టినపుడు పవన్‌ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. పవన్‌ నిజాలు మాట్లాడటం కంటే రాజకీయాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ ఎప్పుడూ పారిపోయే వ్యక్తి కాదని, పోరాడేతత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు.

పవన్‌ ఒక్కసారైనా ఎమ్మెల్యేల కొనుగోలు తప్పు అని మాట్లాడారా అని సూటిగా అడిగారు. పవన్‌ మీది ప్రశ్నించే పార్టీ అంటారు..మరి నాలుగేళ్లు సైలెంట్‌గా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు మాట, పవన్‌ నోట అన్న విధంగా పరిస్థితి తయారైందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు