‘చలో అసెంబ్లీ’కి వైఎస్సార్‌సీపీ మద్దతు

20 Nov, 2017 03:59 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న వెలంపల్లి. చిత్రంలో మల్లాది విష్ణు, పైలా సోమినాయుడు

విజయవాడ సిటీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టంలోని హామీల అమలు కోసం సోమవారం నిర్వహించనున్న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తోందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు, పార్టీ అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు చెప్పారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో తమ పార్టీ శ్రేణులు కూడా పాల్గొని ప్రత్యేక హోదా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చాటిచెబుతాయని స్పష్టం చేశారు. వారు ఆదివారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని వెలంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైఎస్సార్‌సీపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సభలు, దీక్షలు, యువభేరి సభలతో యువతలో చైతన్యం రగిల్చిందని మల్లాది విష్ణు చెప్పారు. 

కాంగ్రెస్‌ మద్దతు: రఘువీరా
వామపక్షాలు, ప్రజాసంఘాలు కలిసి చేపడుతున్న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్టు పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కాగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

నిర్బంధాలతో ‘చలో అసెంబ్లీ’ ఆగదు: రామకృష్ణ 
ముందస్తు అరెస్టులు, నిర్బంధాలతో ప్రభుత్వం వేధించినా ఈ నెల 20న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం జరిగి తీరుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. విజయవాడ దాసరి భవన్‌లో ఆదివారం సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, జల్లి విల్సన్, రావుల వెంకయ్యలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్లు దాటినా విభజన చట్టానికి సంబంధించి ఇంత వరకు ఒక్క హామీ కూడా సక్రమంగా అమలుకాలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధన కోసమే చలో అసెంబ్లీ కార్యక్రమం తలపెట్టామని రామకృష్ణ చెప్పారు.  

మరిన్ని వార్తలు