కార్యకర్తలే మూలస్తంభాలు

20 Feb, 2018 11:33 IST|Sakshi
జ్యోతి వెలిగించి శిక్షణ ప్రారంభిస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, యార్లగడ్డ వెంకట్రావ్, సామినేని ఉదయభాను, తాతినేని పద్మావతి, వెలంపల్లి శ్రీనివాస్‌

 వైఎస్సార్‌ సీపీ రీజనల్‌కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి

విజయవాడలో పార్టీ   కృష్ణాజిల్లా బూత్‌ కన్వీనర్ల  శిక్షణ శిబిరాలు ప్రారంభం

కార్యకర్తల నుంచి విశేష స్పందన

అంశాలవారీగా  నాయకుల ఉపన్యాసాలు స్ఫూర్తినింపిన ప్రసంగాలు

విజయవాడ సిటీ: వైఎస్సార్‌ సీపీ కృష్ణాజిల్లా పోలింగ్‌ బూత్‌ కన్వీనర్ల శిక్షణ శిబిరాలు విజయవాడలోని ఐవీ ప్యాలెస్‌లో  సోమవారం ప్రారంభమయ్యాయి. పార్టీ సీనియర్‌ నేత, జిల్లా రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగే శిబిరాల్లో తొలిరోజు పెనమలూరు, గన్నవరం, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాలకు శిక్షణ నిర్వహించారు. తొలుత ముఖ్య అతిథి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి, పోలింగ్‌ బూత్‌ కన్వీనర్లను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలే వైఎస్సార్‌ సీపీకి మూలస్తంభాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టంగా ఉంచే కార్యకర్తల గురించి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ ఆలోచిస్తుంటారన్నారు.

ప్రస్తుతం టీడీపీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో, చక్కటి ప్రణాళికతో ప్రజల ముందుకు వెళ్లాలని సూచించారు. నూతన ఓటర్ల నమోదు, వారిలో చైతన్యం తీసుకురావడం తదితర అంశాల్లో ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. పార్టీలకు అతీతంగా, పేదరికమే ప్రాతిపదికగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి పలు పథకాలు అమలు చేశారని, అలాంటి రాజ్యం మళ్లీ రావాలంటే జగన్‌ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. దాదాపు 3,500 మంది పోలింగ్‌ బూత్‌ కన్వీనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పెద్దిరెడ్డి వివరించారు. ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌ కన్వీనర్లు, కార్యకర్తలే కీలకమని, కాబట్టి కష్టపడి పనిచేయాలని సూచించారు.

వైఎస్సార్‌ సీపీ విజయంతో   పేద కుటుంబాల్లో మార్పు :పార్థసారథి
పార్టీ మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయం పేద కుటుంబాల్లో మార్పు తెస్తుందన్నారు. పేదలు, వెనకబడిన వర్గాలకు విద్య, ఆరోగ్యం, ఆర్థిక, సామాజిక, రాజకీయాభివృద్ధి దిశగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పథకాలు రూపకల్పన చేశారని వాటిని వివరించారు.

పలు అంశాలపై ప్రసంగాలు
∙గన్నవరం, పెనమలూరు నిజయోజకవర్గాలకు సంబంధించి ‘రాజకీయాలపై సోషల్‌ మీడియా ప్రభావం’ అనే అంశంపై చల్లా మధుసూదన్‌రెడ్డి, ‘వ్యక్తిత్వ వికాస నాయకత్వ లక్షణాలు’ అనే అంశంపై పరసా రవి, ‘పోలింగ్‌ బూత్‌ శిక్షణ తరగతుల విశిష్టత’ గురించి పార్టీ సీనియర్‌ నేత సామినేని ఉదయభాను, ‘సామాజిక న్యాయం’  అనే అంశంపై పద్మారావు, ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితులు’పై మాజీ మంత్రి, మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ప్రసంగించారు.
∙పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాలకు సంబంధించి ‘రాజకీయాలపై సోషల్‌ మీడియా ప్రభావం’ అనే అంశంపై లావణ్య, ‘స్థానిక సంస్థలు’ అనే అంశంపై కుంభా రవి, ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితులు’పై శాసన మండలిలో ప్రతిపక్ష నేత డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రసంగించారు.
ఈ శిక్షణా కార్యక్రమాల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్, అవనిగడ్డ సమన్వయకర్త సింహాద్రి రమేష్, గన్నవరం సమన్వయకర్త యర్లగడ్డ వెంకట్రావ్, పార్టీ నగర అధ్యక్షుడు, అధికార ప్రతినిధి వెలంపల్లి శ్రీనివాస్, జిల్లా పరిషత్‌ పార్టీ ఫ్లోర్‌లీడర్‌ తాతినేని పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు