ముగిసిన ‘వంచనపై గర్జన’ దీక్ష

2 Jun, 2018 17:45 IST|Sakshi

సాక్షి, నెల్లూరువైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’  దీక్ష ముగిసింది. నవ నిర్మాణ దీక్ష పేరుతో ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు వంచనపై నెల్లూరు వీఆర్‌ కళాశాల గ్రౌండ్‌లో శనివారం వైఎస్సార్‌ సీపీ నేతలు గర్జన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను వంచించిందని వైఎస్సార్‌ సీపీ నేతలు ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలతో పాటు హోదా అంశాన్ని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.2019 ఎన్నికలలో టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ...నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు మళ్లీ నాటకాలు మొదలు పెట్టారని  అన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను ఉక్కుపాదంతో అణిచివేసిన చంద్రబాబు ఇవాళ హోదా అంటూ కూనిరాగం తీస్తూ మరోసారి ప్రజలను వంచించేందుకు తయారవుతున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక్కరే నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు.

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని దేశానికే చాటిచెప్పిన నాయకుడు జగన్‌ అన్నారు. గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వనరులను తాకట్టు పెట్టడమే కాకుండా.. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు మూడున్నర లక్షల కోట్లు దోచేశారన్నారు. రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, చంద్రబాబు పాలనను కూకటివేళ్లతో పెకిలించడానికి ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు