130 సీట్లతో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం

20 May, 2019 09:05 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కె.నారాయణస్వామి

వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 120 నుంచి 130 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని విజయభేరి మోగించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి స్పష్టం చేశారు. వెదురుకుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగి వేసారిన ప్రజలు తమ అభిమానాన్ని వైఎస్‌ జగన్‌కు ఓట్ల రూపంలో చూపించారని చెప్పారు. త్వరలో రాజన్నరాజ్యం రాబోతోందని, ఐదేళ్లుగా అవస్థలు పడ్డ ప్రజలకు మంచి పాలన అందించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు.

ఆంధ్ర ఆక్టోపస్‌గా పేరుపొందిన లగడపాటి రాజగోపాల్‌ టీడీపీ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు సర్వేలతో టీడీపీకి వంత పాడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. చంద్రగిరిలో రీపోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఎన్నికల కోడ్‌ నిబంధనలను ఖాతరు చేయకుండా టీడీపీకి అనుకూలంగా చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం తన సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకు ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లు మండిపడ్డారు. ఎలక్షన్‌ కమిషన్‌ లగడపాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దళితులను ఓట్లు వేయకుండా అడ్డుకుంటారా?
చంద్రబాబు తన సొంత ఇలాకాలో దళితులను స్వేచ్ఛగా ఓట్లు వేయకుండా అడ్డుకోవడం విచారకరమన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు సామాజికవర్గం పెత్తనంతో ఎస్సీ, ఎస్టీలు ఓటు హక్కుకు దూరమైనట్లు చెప్పారు. నేటికీ ఇలాంటి దుస్థితి నెలకొనడంపై బాబు సిగ్గుతో తలదించుకోవాలని సూచించారు. ఇన్నేళ్లుగా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీలపై పెత్తనాన్ని చెలాయించినట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు