చంద్రబాబు కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి 

17 Feb, 2020 04:11 IST|Sakshi

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

సాక్షి, విశాఖపట్నం: గడచిన ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌తోపాటు దాదాపు మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహిస్తే రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు వెలుగు చూశాయన్నారు. మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ తప్పు లేదన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

ముంబైలో 2019 ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలో తనిఖీలు చేయగా.. అప్పటి ఏపీ మంత్రులు ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలకు హవాలా ద్వారా నగదు బదిలీ చేసినట్లు వెల్లడైందన్నారు. ఈ ప్రముఖ సంస్థల్లో ఒకటి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడికి చెందినది కాగా.. మరో రెండు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, లోకేశ్‌ పార్టనర్‌ రాజేశ్‌కు చెందినవని చెప్పారు. 

లూసిడ్‌ డయోగ్నస్టిక్స్‌ ఏర్పాటు అభినందనీయం 
విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని రానున్న తరుణంలో మంచి వైద్య సేవలందించాలనే లక్ష్యంతో లూసిడ్‌ డయోగ్నస్టిక్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య రంగంలో సమూల  మార్పులు తీసుకు వస్తున్నామని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు