పథకం ప్రకారం దుష్ప్రచారం

26 May, 2020 03:00 IST|Sakshi

టీటీడీ ఆస్తులు విక్రయించాలని నిర్ణయించింది టీడీపీ ప్రభుత్వమే

పాత బోర్డు చేసిన తీర్మానంపై సమీక్ష మాత్రమే చేశాం.. నిర్ణయం తీసుకోలేదు 

1974 నుంచి టీటీడీ భూములు అమ్ముతున్నారు 

రాజకీయ వ్యతిరేకతతో ఇలాంటి వార్తలు ప్రచురించొద్దు 

టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి  

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా పేరుగాంచిన తిరుమల కొండ గురించి వార్తలు రాసేటప్పుడు రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాలు మానేయాలని ఎల్లో మీడియా అధిపతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. 

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), దాని పాలక మండలికి అప్రతిష్ట కలిగేలా టీడీపీ అనుకూల మీడియా ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తోందని టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా మీద, మా పార్టీపై ఉన్న రాజకీయ వ్యతిరేకతతో ఇలాంటి వార్తలు ప్రచురించవద్దని.. చేతులు జోడించి నమస్కరిస్తున్నా’ నని ఆయన విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఆస్తులు అమ్ముతున్నామంటూ చేస్తున్న ప్రచారం అవాస్తవమని, గత ప్రభుత్వ హయాంలో చేసిన తీర్మానంపై సమీక్ష మాత్రమే చేశామని సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. టీటీడీ ఆస్తుల వేలంపై నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా పేరుగాంచిన తిరుమల కొండను గురించి వార్తలు రాసేటప్పుడు దయచేసి రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాలు మానేయాలని ఎల్లో మీడియా అధిపతులు రామోజీరావు, రాధాకృష్ణకు వైవీ విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

► గతంలో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్‌ నడిబొడ్డున 450 ఎకరాలు అప్పనంగా ఐఎంజీకి కట్టబెట్టింది. అలాంటి కార్యక్రమాలు మేం చేశామా? టీటీడీ ఆస్తులు అమ్మడానికి కమిటీ వేసిన వారే మాపై నిందలు వేస్తున్నారు. 
► చంద్రబాబు హయాంలో సదావర్తి భూములు ఎలా కొట్టేయాలని చూశారో ప్రజలంతా చూశారు. వాటిని కోర్టుకు వెళ్లి కాపాడిన చరిత్ర మాది. ఆస్తుల వేలం మేం ప్రారంభించిన కార్యక్రమంలా నిందలు వేస్తున్నారు. 1974 నుంచి టీటీడీ భూములు అమ్ముతున్నారు. 
► రెండ్రోజుల నుంచి మాట్లాడుతున్న బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ఐవైఆర్‌ కృష్ణారావు వాస్తవాలు కనుక్కుంటే బాగుండేది. 
► ఇప్పుడు ఆస్తుల అమ్మకంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తేదీని కూడా ప్రకటించలేదు. టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయంపై మాత్రమే చర్చించాం. టీటీడీ ఆస్తులపై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటాం.
► బోర్డు నిర్ణయం మేరకు ఆస్తులను అమ్మాల్సి వస్తే పీఠాధిపతులు, స్వామీజీల సలహాలు, సూచనలు తీసుకునే ముందుకెళ్తాం.   

మరిన్ని వార్తలు