టీటీడీ ఆస్తుల విక్రయం నిషిద్ధం 

29 May, 2020 04:27 IST|Sakshi
గురువారం వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం 

వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై నిర్ణయానికి కమిటీ ఏర్పాటు

దుష్ప్రచారంపై సమగ్ర దర్యాప్తు.. ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆస్తుల వివరాలు

లాక్‌డౌన్‌ ముగియగానే ప్రభుత్వ అనుమతితో భక్తులకు దర్శనాలు

టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి వెల్లడి

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి కానుకల రూపంలో భక్తులిచ్చిన ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని టీటీడీ పాలక మండలి తీర్మానించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వాటిని ఎలా ఉపయోగించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి బోర్డు సభ్యులు, స్వామీజీలు, భక్తులు, మేధావులతో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా టీటీడీ తదుపరి చర్యలు తీసుకోనుంది.

అలాగే,  టీటీడీ ఆస్తుల అమ్మకంపై ధర్మకర్తల మండలి, ప్రభుత్వం మీద కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, కొందరు వ్యక్తులు చేసిన దుష్ప్రచారం వెనుక దాగి ఉన్న కుట్ర గురించి విజిలెన్స్‌ లేదా ఇతర ఏ సంస్థలతో అయినా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని కూడా ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. శ్రీవారి ఆస్తుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం తొలిసారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఆయన ఏం చెప్పారంటే..

► టీటీడీ ఆస్తుల అమ్మకంపై దుష్ప్రచారాన్ని బోర్డు ఖండించింది. 
► ఈ ఆస్తుల అమ్మకానికి సంబంధించి గత ప్రభుత్వం నియమించిన ధర్మకర్తల మండలి తీర్మానం చేయగా.. ప్రస్తుత బోర్డు ఈ నిర్ణయాన్ని కేవలం సమీక్షించాలని నిర్ణయించింది. అయితే, కొందరు దుష్ప్రచారం చేశారు. 
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందించి ఆస్తులు అమ్మకూడదని జీఓ జారీచేశారు. 
► తిరుమలలో విశ్రాంతి గృహాల నిర్మాణానికి స్థలాలు కేటాయించబోతున్నామని కూడా కొన్ని పత్రికల్లో కథనాలు రాశారు. గత ప్రభుత్వాల హయాంలో విశ్రాంతి గృహాల నిర్మాణానికి స్థలాలు నామినేషన్‌ మీద ఇస్తూ వచ్చారు. 
► కానీ, ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ ఈ విషయంలో పారదర్శకంగా అందరికీ అవకాశం వచ్చేలా మార్గదర్శకాలు తయారుచేయాలని బోర్డును ఆదేశించారు. 
► గతంలో దాతలు నిర్మించిన విశ్రాంతి గృహాల్లో కొన్ని పాడుబడ్డాయి. వీటిని మళ్లీ నిర్మించి ఇవ్వాలని వారికి టీటీడీ లేఖలు రాసింది. చాలామంది తిరిగి నిర్మించలేమని లేఖలు రాశారు. 
► వీటిని నామినేషన్‌ కింద కాకుండా డొనేషన్‌ పథకంలో చేర్చి, కొన్ని మార్గదర్శకాలు రూపొందించి ఇందులో అర్హులైన వారికే విశ్రాంతి గృహాల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తాం.
► తిరుమల అతిథి గృహాల కోసం నిర్వహించిన టెండర్లను రద్దుచేసి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని ఆదేశాలు జారీచేశారు.
► టీటీడీ విద్యా సంస్థల్లో ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లు ప్రారంభించాలని బోర్డు తీర్మానించింది. ఈ సమావేశంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, సభ్యులు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. పుత్తా ప్రతాపరెడ్డి మినహా మిగిలిన వారంతా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు