సీఎంను నిలదీయండి

2 Aug, 2018 10:51 IST|Sakshi
మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి

ఒంగోలు (ప్రకాశం): జిల్లా అభివృద్ధికి ఇప్పటి వరకు ప్రకటించిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి ఎందుకు జిల్లాకు వస్తున్నారో ప్రజలు నిలదీయాలని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన ఒంగోలులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం వచ్చిన ప్రతిసారీ హామీలు ఇవ్వడం మినహా ఏ ఒక్కదానిని నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాలుగేళ్లు గడిచినా ఆ ప్రాజెక్టుకు కేవలం రూ.600 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు.

తాజాగా రూ.700 కోట్లతో టెండర్లు పిలవనున్నట్లు పేర్కొంటున్నారని, నాలుగేళ్ల కాలంలో 3.6 కిలోమీటర్లు పూర్తి చేసి, మిగిలిన 3 కి.మీకుపైగా పనులు ఆరు నెలల్లో పూర్తి చేస్తామనడం ప్రజల్ని మభ్యపెట్టడం కాదా..? అని ప్రశ్నించారు. జిల్లాలోని గుండ్లకమ్మ మిగులు పనులు, సంగమేశ్వరం, చేస్తామనడం ప్రజల్ని మభ్యపెట్టడం కాదా..? అని ప్రశ్నించారు. జిల్లాలోని గుండ్లకమ్మ మిగులు పనులు, సంగమేశ్వరం, కొరిశపాడు యర్రం చిన పోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కూడా పూర్తిగా నత్తనడకనే సాగుతున్నాయన్నారు.
 
కేంద్ర ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నారు.
ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేపట్టకపోగా జిల్లాకు కేంద్రం ప్రకటించిన పథకాలను సైతం ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడుతున్నారని సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. నిమ్జ్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2015–16లో అంగీకరించినా నేటివరకు భూములను స్వాధీనం చేయకపోవడం, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటుకు ఎందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తుందో సమాధానం చెప్పాలన్నారు. రామాయపట్నం పోర్టు విషయంలో కూడా ప్రతిపాదనలు పంపితే పోర్టు నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్రం ప్రకటించినా చంద్రబాబు మాత్రం కృష్ణపట్నం పోర్టు యాజమాన్యంతో కుమ్మక్కై రామాయపట్నం పోర్టు రాకుండా అడ్డుపడుతున్నారన్నారు.మూడు వేల ఎకరాలు మాత్రమే కేంద్రం కోరుతుండగా నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు. చీరాలలో మరో పోర్టు నిర్మిస్తామంటే తాము అడ్డుకాదని, రెండు పోర్టులు నిర్మించడం ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందనేదే తమ భావన అన్నారు.

2015–16, 2016–17 సంవత్సరాలలో ఎంపీగా తాను సూరారెడ్డిపాలెం, సింగరాయకొండ, ఒంగోలు అగ్రహారం, గిద్దలూరు టౌన్‌ పరిధిలో నాలుగు ఆర్‌వోబీ/ఆర్‌యూబీలకు అనుమతులు తీసుకువచ్చానని చెప్పారు. కానీ వాటికి అప్రోచ్‌ అంచనాలు పంపడంలో నేటికి జిల్లా యంత్రాంగాలు ముందుకు రాకపోవడం శోచనీయం అన్నారు. ఒంగోలులో ఈఎస్సై ఆస్పత్రి నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చినా ఎకరం స్థలం చూపలేకపోవడం వల్ల నేటికీ అది కార్యరూపం దాల్చకపోవడం బాధ కలిగిస్తుందన్నారు.

 రైతుల పట్ల నిర్లక్ష్యం:
2017 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతాంగానికి సైతం ఇంతవరకు పరిహారం అందలేదని, 2015లో శెనగలు కోల్డు స్టోరేజీలలో ఉన్నపుడు తాము కేంద్ర మంత్రిత్వశాఖతో మాట్లాడినందువల్లే కేంద్రం ముందుకు వచ్చి శెనగలను కొనుగోలుచేసిందన్నారు. గత ఏడాది శెనగలు సైతం నేడు కోల్డు స్టోరేజీలలోనే ఉన్నాయని కనుక తక్షణమే కేంద్రప్రభుత్వంతో మాట్లాడి నాఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయించేందుకు చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైవీ సుబ్బారెడ్డి హితవు పలికారు.

జిల్లాలో 75శాతం కౌలు రైతులు ఉన్నా వారికి ఒక్క బ్యాంకరు రుణం ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని దీంతో వ్యవసాయం అధ్వానంగా మారిందన్నారు. బ్రిటీష్‌ కాలం నుంచి సాగు చేసుకుంటున్న చుక్కల భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ స్పష్టమైన ప్రకటన చేసి రైతాంగంలో నెలకొన్న ఆందోళనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన కందులకు సైతం రూ.45కోట్లు బకాయిలున్నాయని, అదే పచ్చచొక్కాల ఏజెంట్లు ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రం వందశాతం నిధులు చెల్లించారని విమర్శించారు.
 
రాష్ట్ర ప్రభుత్వ వివక్షను ఎండగట్టేందుకే పాదయాత్ర:
రాష్ట ప్రభుత్వం ప్రకాశం జిల్లా పట్ల కొనసాగిస్తున్న వివక్షను ఎండగట్టేందుకే ఈనెల 10వ తేదీ తరువాత వెలిగొండ ప్రాజెక్టు పరీవాహక ఐదు నియోజకవర్గాలలో పాదయాత్ర చేపట్టనున్నట్లు సుబ్బారెడ్డి ప్రకటించారు. వెలిగొండ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా పశ్చిమ ప్రకాశం ఫ్లోరైడ్‌ రహిత జిల్లాగా మారుతుందని, కానీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అవలంభిస్తున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు పాదయాత్ర నిర్వహిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు చుండూరి రవి, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, దామరాజు క్రాంతికుమార్, కేవీవీ ప్రసాద్, గొర్రెపాటి శ్రీనివాసరావు, పులుగు అక్కిరెడ్డిలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు