కేంద్ర రైల్వేశాఖ మంత్రితో ఒంగోలు ఎంపీ భేటీ

21 Mar, 2018 11:48 IST|Sakshi
కేంద్ర రైల్వేశాఖామంత్రి పీయూష్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేస్తున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

 అన్నవరప్పాడు గుడిసెవాసులకున్యాయం చేయాలని విజ్ఞప్తి

ఒంగోలు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మరోమారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అన్నవరప్పాడు గుడిసెవాసుల సంఘం సమస్యను చర్చించారు. 1927 నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద ప్రజానీకం చిన్న చిన్న నివాసాలు ఏర్పాటుచేసుకొని జీవిస్తున్నారన్నారు. ఎప్పటినుంచో అక్కడ నివాసం ఉంటున్నవారిని రైల్వే అ«థారిటీవారు వెళ్లిపొమ్మనడం అన్యాయమన్నారు. వారు అతికష్టం మీద ఇప్పటికే రైల్వే వర్గాలకు కోటిరూపాయలకు పైగా డబ్బు చెల్లించారన్నారు.

కానీ ఇప్పటి మార్కెట్‌ రేటు ప్రకారం పాతిక కోట్లు వరకు చెల్లించాలనడం భావ్యం కాదన్నారు. పేద ప్రజలకు అనుగుణంగా వారి విజ్ఞప్తి మేరకు తక్షణమే ఆ స్థలాలు వారికి కేటాయించి సమస్య పరిష్కరించి పట్టాలు అందజేయాలన్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌ ఈనెల 21వ తేదీ వారందరితో సమావేశం ఏర్పాటు చేశారని, కేంద్రమంత్రిగా మీరు చొరవ తీసుకొని రైల్వే జీఎం, రైల్వే బోర్డు, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు