‘టీడీపీ డ్రామాలను దేశమంతా చూసింది’

6 Jun, 2018 10:25 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : తమ రాజీనామాలు ఆమోదించాలని లోక్‌సభ స్పీకర్‌పై మరోసారి ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఐదుగురు వైఎఎస్సార్‌ సీపీ ఎంపీలు తమ రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాల్సిందేనన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో టీడీపీ చేసిన డ్రామాలను దేశమంతా చూసిందని, నాలుగేళ్లు కేంద్రంతో కలిసి ఉండి ఏం సాధించారో చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. 

తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని, హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మొదటినుంచీ హోదా కోసం వైఎస్సార్‌ సీపీ పోరాడుతూనే ఉందని, ఇందుకోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలందరం ఆమరణ దీక్ష చేశామని గుర్తుచేశారు. చంద్రబాబు దీక్షలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే చంద్రబాబు హేళన చేశారని, తర్వాత యూటర్న్‌ తీసుకుని టీడీపీ కూడా అవిశ్వాసం పెట్టలేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం ఉన్నా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు