ఎన్‌ఐఏ విచారణపై ఉలుకెందుకు?

14 Jan, 2019 04:34 IST|Sakshi

సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజం

ఎన్‌ఐఏ దర్యాప్తుతో జగన్‌పై హత్యాయత్నం వెనుక కుట్రలు బయటికొస్తాయని ఆందోళన చెందుతున్నారు  

ఒంగోలు సిటీ: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏ విచారిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు ఉలుకెందుకని వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రశ్నించారు. దీనిపై ప్రధానికి సీఎం లేఖ రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆదివారం ఒంగోలులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్‌ఐఏ దర్యాప్తుతో ప్రభుత్వ పెద్దల కుట్రలు బయటకొస్తాయన్న ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రత్యేక హోదాపై లేఖ రాయడానికి నాలుగేళ్ల ఎనిమిది నెలలపాటు స్పందించని చంద్రబాబు.. ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకి అప్పగించిన గంటల వ్యవధిలోనే స్పందించి ప్రధానికి లేఖ రాయడం భయం పట్టుకున్నందువల్లేనని వైవీ అన్నారు.

ఈ కుట్ర వెనుక సీఎం, డీజీపీ స్థాయి వారితోపాటు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల పాత్ర ఉందన్నారు. ఎన్‌ఐఏ విచారణను ఎలా ఆపాలి, ఎలా అడ్డుకోవాలని చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే చిన్న సంఘటనగా చంద్రబాబు, డీజీపీ పేర్కొనడం వెనుక ఆంతర్యాలున్నాయని, నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తేనే ఈ కుట్రలోని వ్యక్తులు, పాత్రధారుల వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. న్యాయంకోసం హైకోర్టును ఆశ్రయించామన్నారు. చంద్రబాబుకు హైకోర్టుపై గౌరవ, మర్యాదలు లేవన్నారు. హైకోర్టు ఎన్‌ఐఏ విచారణకు కేసును ఇవ్వమంటే చంద్రబాబు అవసరం లేదని కోర్టు ఆదేశాల్నే ధిక్కరించే పరిస్థితిలో ఉన్నారని తెలిపారు.

ఎన్‌ఐఏ ఈ కేసులోని పెద్దలను కుట్రదారుల నిగ్గు తేలుస్తుందని, అప్పుడు తెలుస్తుంది ఇది కోడికత్తా.. చంద్రన్న కత్తా అనేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో దోపిడీ, రాక్షస పాలన సాగుతోందన్నారు. వ్యవస్థల్ని చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారని, రాష్ట్రాన్ని అన్నివిధాలుగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 

మరిన్ని వార్తలు