‘ఎన్‌డీఏతో తెగదెంపులు.. టీడీపీ ఆడిన డ్రామా’

20 Jul, 2018 18:24 IST|Sakshi
వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ సాక్షిగా టీడీపీ-బీజేపీల బంధం మరోసారి బట్టబయలైంది. ఇన్ని రోజులు విడిపోయినట్లు సంకేతాలు ఇచ్చి.. లోపల మాత్రం బలమైన బంధాలు అలానే ఉన్నాయనే విషయం అర్థమౌతుంది. పార్లమెంట్‌ సమావేశంలో శుక్రవారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎన్‌డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలిగినప్పటికీ.. చంద్రబాబు మాకు మిత్రుడేనని వెల్లడించారు. లోక్‌సభలో రాజ్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం డ్రామా బయటపడింది. దీనిపై హోదా కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అంతేకాక రాజ్‌నాథ్‌ స్టేట్‌మెంట్‌పై టీడీపీ ఎంపీలు కనీసం నిరసన కూడా తెలపలేదని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు.

ఆ సమయంలో టీడీపీ నాయకులు రాజ్‌నాథ్‌ చేసిన స్టేట్‌మెంట్‌ను వింటూ కుర్చున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో టీడీపీ-బీజేపీ బంధంపై మేం చెప్పిందే నిజమైందని వైఎస్సార్‌సీపీ నేత అన్నారు. బీజేపీతో బంధం కొనసాగుతోంది కాబట్టే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లలేదు. అవిశ్వాసంపై లోపాయికారిగా ముందే మాట్లాడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిధులపై రాజ్‌నాథ్‌ సింగ్ మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే ఎన్‌డీఏతో తెగదెంపులు.. టీడీపీ ఆడిన డ్రామా అని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు