‘నిరర్థక’ నిర్ణయం టీడీపీ హయాంలోనే

25 May, 2020 02:12 IST|Sakshi

టీటీడీ గత పాలక మండలి నిర్ణయాల అమలుకే ఇప్పుడు ఆమోదం

50 ఆస్తులను విక్రయించాలని చంద్రబాబు హయాంలోనే పాలక మండలి నిర్ణయం

సబ్‌ కమిటీ నివేదికను ఆమోదించిన చదలవాడ నేతృత్వంలోని నాటి పాలక మండలి

భక్తుల మనోభావాలను దెబ్బ తీయెద్దు: టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

దేవుడంటే మాకు భయం, భక్తీ.. రాజకీయాలకు వాడుకుంటే పోతారు: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

ఆలయాలను కూల్చిన చరిత్ర చంద్రబాబుదే: దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల విక్రయం ప్రక్రియ 1974 సంవత్సరం నుంచి జరుగుతోంది. 2014 వరకు 129 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. టీడీపీ నేత అయిన చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయం(2015)లో నిరర్థక ఆస్తులను విక్రయించడానికి సబ్‌ కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదిక మేరకు 50 నిరర్థక ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు అప్పట్లో చదలవాడ అధ్యక్షతన పాలక మండలి తీర్మానం చేసింది.
– టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

సాక్షి ప్రతినిధి, తిరుపతి, తిరుపతి సెంట్రల్, సాక్షి అమరావతి: బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించిన టీటీడీకి చెందిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని 50 ఆస్తులు దేవస్థానానికి ఏమాత్రం  ఉపయోగపడని వేనని, కొన్ని చానళ్లు దీనిపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవరిస్తున్నాయని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్తుల వేలానికి సంబంధించి గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాల అమలుకు మాత్రమే ప్రస్తుతం ఆమోదం తెలిపామని వివరించారు. టీటీడీ ఆస్తులను, సదావర్తి సత్రం భూములను అధికారంలో ఉండగా వేలం వెర్రిగా విక్రయించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయటాన్ని టీటీడీ పాలకమండలి ఎక్స్‌ అఫిషియో సభ్యుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు. ‘దేవుడంటే మా ప్రభుత్వానికి భయమూ, భక్తి ఉన్నాయి. మేం తప్పు చేయం. ఎవరైనా తప్పు చేసినా అంగీకరించేది లేదు’ అని చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. దేవుడన్నీ చూస్తున్నాడని, భగవంతుడిని రాజకీయాలకు వాడుకుంటే పోతారని, ఆ తరువాత మీ ఖర్మని హెచ్చరించారు. తిరుపతి, విజయవాడలో వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడిన విషయాలివీ..

వేలం తీర్మానాన్ని ఆమోదించింది మీరే: చెవిరెడ్డి 
టీడీపీ సర్కారు హయాం లో చదలవాడ కృష్ణ మూర్తి నేతృత్వంలోని పాలకమండలి టీటీడీకి సంబంధించి ఉపయో గంలో లేని, నిర్వహణకు ఇబ్బందైన 50 ఆస్తులను వేలం వేసి విక్రయించేందుకు సబ్‌ కమిటీని నియమించడం నిజం కాదా? ఆ భూములను విక్రయించాలని నాడు సబ్‌ కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ మేరకు పాలకమండలి తీర్మానం చేయడం నిజం కాదా?
► సబ్‌ కమిటీలో బీజేపీకి చెందిన భానుప్రకాష్‌రెడ్డి, నాటి టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఈనాడు పత్రిక ఎండీ కిరణ్‌ వియ్యపురాలు ఎల్లా సుచరిత సభ్యులు కారా?
► టీటీడీ భూములను విక్రయించాలని నివేదిక ఇచ్చి మీరు ఆమోదించడం నిజం కాదా? మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తుంటే మాపై విమర్శలా? ఇదెక్కడి న్యాయం?
► 28–7–2015న తీర్మానం నంబర్‌ 84 ప్రకారం సబ్‌ కమిటీని వేసి ఆ సబ్‌ కమిటీ తీర్మానం నంబర్‌ 253, తేదీ 30–1–2016న భూముల వేలానికి ఆమోదించిన మీరే విమర్శలు చేయడం ఏమిటి? 
► భగవంతుడిని ఇలా రాజకీయం కోసం, ప్రచారం కోసం వాడుకోవడం పాపం కాదా? 

1974 నుంచి కొనసాగుతోంది..
► టీటీడీకి సంబంధించిన ఏ అంశంపైనైనా పాలక మండలికే అధికారం ఉంటుంది. ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇది విమర్శకులకు తెలియదా?  జీవో ఎంఎస్‌ నం.311 రెవెన్యూ( ఎండోమెంట్స్‌ –1) ఏప్రిల్‌ 9వ తేదీ 1990 రూల్‌ 165 చాప్టర్‌ 22 ప్రకారం టీటీడీకి ఆ హక్కుంది. 
► 1974 నుంచి 2014 వరకు టీటీడీ నిరర్థక ఆస్తుల అమ్మకం ప్రక్రియ జరిగింది. చంద్రబాబు హయాంతో కలిపి మొత్తంగా 129 ఆస్తులను వేలం వేసి రూ.6.39 కోట్లకు విక్రయించలేదా?, ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న వారు దీనిపై ఏం చెబుతారు?

బాబు హయాంలో మెడికల్‌ కాలేజీకి దేవాలయ భూములు హారతి కర్పూరం..
► విశాఖలో దేవదాయ శాఖకు చెందిన భూములను మెడికల్‌ కాలేజ్‌ కోసం విక్రయించింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా 60 ఎకరాల భూమిని కట్టబెట్టింది మీరు కాదా? రూ.వేల కోట్లు విలువ చేసే సదావర్తి భూములను రూ.50 కోట్లకు వేలం పెట్టింది మీరు కాదా?
► విజయవాడలో 30 ఆలయాలను కూలదోసింది మీరు కాదా? దేవదాయ భూముల లీజు కాలపరిమితిని 12 ఏళ్ల నుంచి చట్ట సవరణతో 33 సంవత్సరాలకు పెంచింది మీరు కాదా?
నిరర్థక ఆస్తులను విక్రయించే అంశాన్ని పరిశీలించి నివేదించేందుకు 2015 జూలై 28న ఒక సబ్‌ కమిటీని నియమిస్తూ టీటీడీ ఆమోదించిన తీర్మానం 

వెంకన్నను దర్శించుకున్నాకే జగన్‌ ప్రమాణ స్వీకారం..
► అత్యంత భక్తి శ్రద్ధలతో 52 సార్లు శ్రీవారిని దర్శించుకున్న ఏకైక సీఎం దివంగత వైఎస్సార్‌. సుదీర్ఘ పాదయాత్ర అనంతరం తిరుమలకు నడిచి వెళ్లి సాధారణ క్యూలో నిలుచుని దర్శనం చేసుకు న్నాక ఇంటికి వెళ్లింది మా నాయకులు కాదా? వెంకన్నను దర్శించుకుని వెళ్లాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మా నాయకుడు కాదా?  మా నాయకుడు దేవుడిని నమ్మి పనిచేస్తారు. మీలా భగ వంతుడిని రాజకీయాలకు వాడుకునే వ్యక్తి కాదు.

బోర్డుకే అధికారాలు: టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
► జీవో ఎంఎస్‌ నం.311 రెవెన్యూ (ఎండోమెంట్స్‌ –1), తేదీ 09 – 04 – 1990 రూల్‌ –165, చాప్టర్‌ – 22 ద్వా రా టీటీడీకి మేలు జరిగే అవకాశం ఉం టే దేవ స్థానం ఆస్తులను విక్రయించడం, లీజుకు ఇవ్వడం లాంటి అధికారాలు టీటీడీ బోర్డుకే ఉన్నాయి. బోర్డు నిర్ణయా లకు, ప్రభుత్వా నికి ఎలాంటి సంబంధం లేదు.  
► దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల విక్రయం ప్రక్రియ 1974 నుంచి జరుగుతోంది. 2014 వరకు 129 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. 
► చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పాలకమండలి తీర్మానం నం.84, తేదీ 28–07–2015 మేరకు టీటీడీకి ఉపయోగప డని ఆస్తుల ను బహిరంగ వేలం ద్వారా విక్రయించ డంపై సబ్‌ కమిటీని నియమించారు. 
► కమిటీ నివేదిక మేరకు తీర్మానం నం.253, తేదీ 30–01–2016 ద్వారా సబ్‌ కమిటీ గుర్తించిన 50 నిరర్ధక ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్ర యించేందుకు చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలక మండలి ఆమోదం తెలిపింది.  ఈ తీర్మానం మేరకు దేవస్థానం సిబ్బంది ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లోని 17 ఆస్తులు, పట్టణ ప్రాంతాల్లోని 9 ఆస్తులు, తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో 23 ఆస్తులకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల రికార్డుల్లో  విలువ, బహిరంగ మార్కెట్‌ విలువలను సేకరించి పాలకమండలికి నివేదించారు. ఒక ఆస్తికి సంబం ధించి కోర్టు కేసు ఉండడంతో వేలం ప్రక్రియ నుంచి మినహాయించారు. 

గత పాలక మండలి నిర్ణయాన్నే ఆమోదించాం..
► రుషికేష్‌లోని 1.20 ఎకరాల భూమి దురాక్రమణకు గురయ్యే ప్రమాదం ఉండడంతో వేలం జాబితాలో చేర్చారు. 50 నిరర్థక ఆస్తుల విలువను రూ.23.92 కోట్లుగా ప్రస్తుత పాలక మండలి తీర్మానం నం.309 తేదీ 29–02 – 2020 ద్వారా నిర్ణయిస్తూ గత పాలక మండలి చేసిన నిర్ణయాలను అమలు చేయడానికి ఆమోదం మాత్రమే తెలిపాం. 
► ఇందులో 5 సెంట్ల లోపు ఖాళీ ఇళ్ల స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు వ్యవసాయ భూముల వల్ల దేవస్థానానికి ఎలాంటి ఆదాయం లేకపోగా ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉన్నందున బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి నిర్ణయించాం.

ఆ రోజెందుకు ప్రశ్నించలేదు: దేవదాయ మంత్రి వెలంపల్లి
► టీటీడీ భూములను విక్రయిం చాలని టీడీపీ హయాం లోనే కమిటీ నిర్ణయించి నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడెందుకు దుష్ప్రచారం చేస్తున్నారు?
► చంద్రబాబు మాదిరిగా చీకటి జీవోలిచ్చి విక్ర యించే ఆలోచన సీఎం జగన్‌కు లేదు. సదావర్తి భూములను చంద్రబాబు దొంగ చాటుగా వేలం వేసినట్లుగా ఈ ప్రభుత్వం చేయదు. 
► తన పాలనలో దేవాలయాలను కూల్చిన ఘనత చంద్రబాబుదే. ఏడాది పాలనపై చర్చకు మేం సిద్ధం. చంద్రబాబుకు దమ్ముంటే చర్చకు ముందుకు రావాలి. అవినీతిని ఏడాది పాలనలో సీఎం జగన్‌ తరిమికొట్టారు. 
► పవన్‌ కల్యాణ్‌ మాదిరిగా మేం ఫాంహౌస్‌లో తాగి పడుకోవడం లేదు. దేవదాయ శాఖ మంత్రి రంజాన్‌ తోఫా ఎలా పంచుతారు అని ప్రశ్నిస్తున్నారు. మొదట నేను ఎమ్మెల్యేను, తర్వాత మంత్రిని. నియోజకవర్గంలో అన్ని మతాల వారికి అండగా ఉంటా. 

మరిన్ని వార్తలు