-

'రాజకీయ అవసరాల కోసమే ఇలాంటి కుట్రలు'

1 Dec, 2019 19:38 IST|Sakshi

సాక్షి, తిరుమల : రాజకీయ అవసరాల కోసం తిరుమలలో చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కుట్రలో భాగంగానే టీటీడీలో అన్యమత ప్రచారమని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటూ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించాలని వారు భావిస్తున్నట్లు ధ్వజమెత్తారు. అతిపెద్ద హిందూ దేవస్థానమైన టీటీడీపై అన్యమత ముద్ర వేస్తూ ఒక ప్రముఖ దినపత్రిక  ప్రచురణ చేయడం దురదృష్టమని పేర్కొన్నారు. మీడియా చేతిలో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం చేయడాన్ని దేవుడు కూడా క్షమించడని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీని అన్ని మతాల వారు ఓట్లు వేసి గెలిపించారు. టీటీడీలో ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయంటూ ఆరోపణలు చేయడం తగదన్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై గూగుల్‌ నుంచి వివరణ కోరనున్నట్లు  ఆయన తెలిపారు.

గతంలో కూడా తిరుమలలోని ఏడు కొండలపై సిలువ గుర్తు ఉందంటూ, బస్సు టికెట్ లో ఇతర మతాల గుర్తులు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేసారని మండిపడ్డారు. టీటీడీని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టీటీడీ వెబ్‌సైట్‌లో దుష్ర్పచారం జరగకుండా ఉండేందుకు సైబర్‌క్రైమ్‌ను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరతామని వెల్లడించారు. వివాదానికి కారణమైన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పాలకమండలిలో చర్చించి వాటిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

వైకుంఠ ద్వారాలు పదిరోజులు తెరుస్తామని టీటీడీ ఎలాంటి ప్రకటన చేయలేదని టీటీడీ ఈవో సింఘాల్‌ పేర్కొన్నారు. టీటీడీ పంచాంగంలో శ్రీయైనమః పదానికి బదులుగా గూగుల్ అనువాదంలో శ్రీయేసయ్య నమః అని వచ్చినట్లు తెలిపారు. ఫోటోగ్రాఫ్ లో ఉన్న పదాలను ప్రాంతీయ భాషల్లో అనువాదం చేయడంలో గూగుల్ లో పొరపాట్లు జరుగుతుంటాయని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా ఏ నిర్ణయం తీసుకోకుండానే మీడియాలో చర్చలు పెడుతున్నారని వివరించారు. అసలు అన్యమత ప్రచారం చేస్తున్న విషయం టీటీడీ వెబ్‌సైట్లో లేదని, గూగుల్‌ సెర్చ్‌లో మాత్రమే అది కనిపిస్తోందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు