చెరకు తోటలో పోటీ.. ఎవరి నోరు తీపి?

20 Mar, 2019 09:46 IST|Sakshi
బీబీ పాటిల్‌ ,సురేశ్‌ షెట్కార్‌, మదన్‌మోహన్‌రావు

రివైండ్‌ జహీరాబాద్‌

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో.. ‘చెరకు సాగు, సింగూరు నీరు’ ప్రధానాంశాలు

ఈ నియోజకవర్గానికిది మూడో ఎన్నిక సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ వైపే టీఆర్‌ఎస్‌ మొగ్గు!

కాంగ్రెస్‌ అభ్యర్థిగా మదన్‌మోహన్‌రావు ఖరారు

చెరుకు సాగుకు ప్రసిద్ధి చెందిన జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఆ అంశమే ప్రధాన ప్రచారాస్త్రం కానుంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో చెరకు సాగు సమస్యలతో పాటు సింగూరు నీటి వ్యవహారం ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి. ఏటా చెరుకు క్రషింగ్, మార్కెటింగ్, గిట్టుబాటు, రవాణా, బకాయిల పెండింగ్‌ వంటి సమస్యలతో చెరకు రైతులు సతమతం అవుతున్నారు. అలాగే, ఈ నియోజకవర్గాలన్నీ కూడా సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌ ఆయకట్టు పరిధిలోనివే కావడంతో సాగునీటి అంశం కూడా ప్రధాన ప్రచారాంశం కానుంది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ నెలకొన్న పరిస్థితి ఇదీ..

ముచ్చటగా మూడో ఎన్నిక..
లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణలో 2009లో ఆవిర్భవించిన జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం 3వ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది. ప్రధాన రాజకీయ పక్షాలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ బలాబలాలను పరీక్షించుకునేందుకు సన్నద్ధమయ్యాయి. ఈ స్థానం పరిధిలో సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నా యి. సిట్టింగ్‌ ఎంపీ భీమ్‌రావు బస్వంత్‌రావు పాటిల్‌కు టీఆర్‌ఎస్‌ వరుసగా రెండోసారి టికెట్‌ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ సురేశ్‌షెట్కార్‌ పోటీకి దూరంగా ఉన్నారు. కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి మూడో స్థానంలో నిలిచిన మదన్‌మోహన్‌రావు తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైంది. మరో ప్రధాన రాజకీయ పార్టీ బీజేపీ.. ఓ ఎన్‌ఆర్‌ఐ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఎల్లారెడ్డి మినహా అన్నీ ‘గులాబీలే’..
గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి మిన హా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి నల్లమడుగు (జాజుల) సురేందర్‌ టీఆర్‌ఎస్‌ కీలక నేత ఏనుగు రవీందర్‌రెడ్డిపై గెలుపొందారు. కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగున్నర వేల ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్‌ విజయం సాధించారు. నారాయణఖేడ్‌ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డి 60 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధిం చారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు టీఆ ర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులకు పోలైన ఓట్లను పరిశీలిస్తే ఇరు పార్టీల నడుమ 1.32 లక్షల ఓట్ల తేడా ఉంది. ఏడుసెగ్మెంట్లలో కలిపి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మొత్తం 5,76,433 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 4,43,468 ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌స భ ఎన్నికల్లో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ (టీఆర్‌ఎస్‌)..  సురేశ్‌ షెట్కార్‌(కాంగ్రెస్‌)పై 1.44 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మదన్‌మోహన్‌రావు 1.57 లక్షల ఓట్లు సాధించారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఆరింట టీఆర్‌ఎస్‌ గెలిచింది. ఈ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన మెజార్టీ 1.36 లక్షలు ఉండగా, ఒక్క నారాయణఖేడ్‌ పరిధిలోనే 56 వేల పైచిలుకు ఉంది. ఈ నేపథ్యంలో మదన్‌మోహన్‌రావు గెలుపు అవకాశాలపై నమ్మకంతో ఉన్నారు. పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే ఫలితం సాధ్యమవుతుందని కాంగ్రెస్‌ లెక్కలు వేస్తోంది.

సామాజికవర్గ సమీకరణాలే కీలకం..
జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 4 జనరల్‌ అసెంబ్లీ సెగ్మెం ట్లు, 3 ఎస్సీ రిజర్వుడు సెగ్మెంట్లు ఉన్నాయి. లింగాయత్‌ సామాజిక వర్గం ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని 2009 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచే పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన సురేశ్‌ షెట్కార్‌కు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వగా, ప్రజారాజ్యం పార్టీ కూడా అదే సామాజిక వర్గానికి చెంది న మల్కాపురం శివకుమార్‌కు టికెట్‌ ఇచ్చింది. చివరి నిముషంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సయ్యద్‌ యూసుఫ్‌ అలీపై సురేశ్‌ షెట్కార్‌ 17 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో సురేశ్‌ షెట్కార్‌ తిరిగి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయగా, టీఆర్‌ఎస్‌ లింగాయత్‌ సామాజిక వర్గానికే చెందిన బీబీ పాటిల్‌ను బరిలోకి దించింది. ప్రస్తుత ఎన్నికల్లో బీబీ పాటిల్‌ మరోమారు టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయడం ఖరారు కాగా, కాంగ్రెస్‌ మాత్రం అన్ని లెక్కలు వేసుకొని మదన్‌మోహన్‌రావును ఎంపిక చేసింది. ఇక, బీజేపీ పరిశీలనలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ కూడా లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.

చెరకు, సాగునీటి సమస్యలే ఎజెండా..
జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌ ఆయకట్టు పరిధిలో ఉండటంతో సాగునీరు అంశం ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశాలున్నా యి. గత ఏడాది నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు కోసం సింగూరు నుం చి 16 టీఎంసీల నీటిని విడుదల చేయడంతో పాటు.. ప్రస్తుతం సింగూ రు డెడ్‌ స్టోరేజీకి చేరుకుంది. 29.91 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సింగూరులో ప్రస్తుతం ఒక టీఎంసీ మాత్రమే ఉండటంతో.. అందోలు, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్‌ పరిధిలోని పలు మండలాల్లో నీటి ఎద్దడి నెలకొంది. జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా సింగూరు ప్రాజెక్టు నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. ప్రస్తుతం సింగూరు అడుగంటడంతో ఈ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. దీనినే ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మరోవైపు దేశ రక్షణ, జాతీయ అంశాలు తనకు అనుకూలిస్తాయని బీజేపీ లెక్కలు వేస్తోంది. ఇక, చెరకు సాగు సంబంధ అంశాలు సైతం ఎన్నికల్లో ప్రాధాన్యం వహించనున్నాయి. టీఆర్‌ఎస్‌ మాత్రం పార్టీ బలంగా ఉండటం, ప్రభుత్వ పథకాల అమలుపై ఆశలు పెట్టుకుంది.

సన్నాహక సమావేశాల్లో బిజీ..
లోక్‌సభ ఎన్నికల దిశగా పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేందుకు రాజకీయ పక్షాలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల నిజామాబాద్‌లో జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ నెల 13న నిజాంసాగర్‌లో జరిగిన లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ.. లోపాలను సరిదిద్దుకుని భారీ మెజారిటీ సాధించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ మాత్రం అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ఆలోచనలో ఉంది.- కె.రాహుల్‌

లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లు
సంగారెడ్డి జిల్లా:జహీరాబాద్‌ (ఎస్సీ), అందోలు (ఎస్సీ), నారాయణఖేడ్‌.
కామారెడ్డి జిల్లా:కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ (ఎస్సీ),బాన్స్‌వాడ.

తొలి రెండు ఫలితాలు ఇలా..
2009:ఎస్‌.సురేశ్‌ షెట్కార్‌(కాంగ్రెస్‌–17,407)
2014:బీబీపాటిల్‌(టీఆర్‌ఎస్‌–1.44,631)

లోక్‌సభ ఓటర్లు
పురుషులు 7,36,528
మహిళలు:7,58,889
ఇతరులు:62
మొత్తం:14,95,479

మరిన్ని వార్తలు