7న ఎంపీపీ.. 8న జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికలు

30 May, 2019 03:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మండల ప్రజాపరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జూన్‌ 7న.. జిల్లా ప్రజాపరిషత్‌ (జెడ్పీపీ) చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలు 8న జరగనున్నాయి. ఎంపీపీ ఎన్నికల రోజే మండల కోఆప్షన్, జెడ్పీపీ ఎన్నికల రోజున జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ ఎన్నికలూ పూర్తికానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి బుధవారం నోటిఫికేషన్, షెడ్యూల్‌ జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్‌ 4న నిర్వహించి, అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో మొత్తం 539 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. న్యాయపరమైన అంశాలతో ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. 5,857 ఎంపీటీసీ స్థానాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌ ఎంపీపీ పరిధిలోని 11 ఎంపీటీసీలు, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ఎంపీపీ పరిధిలోని 15 ఎంపీటీసీలు, ములుగు జిల్లా మంగపేటలోని 14 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగలేదు. మొత్తమ్మీద రాష్ట్రవ్యాప్తంగా 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. వాటిలో 4 జెడ్పీటీసీలు, 158 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 534 జెడ్పీటీసీ, 5,659 ఎంపీ టీసీ స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది. కొత్త గా జరిగిన జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా పాత 9 జిల్లాల స్థానంలో(హైదరాబాద్‌ మినహాయించి) 32 కొత్త జిల్లాల్లోని జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు, 538 ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంది. 

6న ఎంపీపీ అధ్యక్షుల ఎన్నిక నోటిఫికేషన్‌... 
జూన్‌ 7న ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు 6వ తేదీన మండలాల్లోని రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. జూన్‌ 7న ఉదయం 10 గంటల వరకు మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్‌ సభ్యుల పదవి కోసం పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాటిని పరిశీలించి, చెల్లుబాటయ్యే నామినేషన్లను ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అనంతరం చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. ఒకవేళ కోఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక జరగకపోతే, ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. కోఆప్షన్‌ సభ్యులను ఎన్నికైన సభ్యుడు ప్రతిపాదించాలి. ఒకే సభ్యుడు రెండు పేర్లను ప్రతిపాదిస్తే ఆ నామినేషన్‌ తిరస్కరిస్తారు. ఒక్కరే పోటీలో ఉంటే ఏకగ్రీవమైనట్టు ప్రకటిస్తారు. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇద్దరు సభ్యులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్ష, ఉపాధ్య ఎన్నిక ఉంటుంది. మొదట ఎంపీపీ అధ్యక్షుడి కోసం పరోక్ష ఎన్నిక నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎంపీపీ ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎన్నికైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేసిన తర్వాత ఎన్నికలు ముగిసినట్లు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటిస్తారు.
 
7న జెడ్పీపీ చైర్‌పర్సన్ల ఎన్నిక నోటిఫికేషన్‌... 
జూన్‌ 8న నిర్వహించే జెడ్పీపీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం జూన్‌ 7న జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల తరహాలోనే జూన్‌ 8న ఉదయం 10 గంటల వరకు జెడ్పీపీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు, కోఆప్షన్‌ సభ్యుల పదవులకు పోటీపడే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాటిని పరిశీలించిన తర్వాత చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించి, ఆ తర్వాత ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. ముందుగా జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీపీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు, ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఎన్నికైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేసి ఎన్నిక ప్రక్రియ ముగిస్తారు. ఏదైనా కారణంతో ఎంపీపీ అధ్యక్ష, జెడ్పీపీపీ చైర్‌పర్సన్ల ఎన్నికలు వాయిదాపడితే, మరుసటిరోజున వాటిని నిర్వహించాలి. రెండోసారి కూడా వాయిదాపడితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలి.

మరిన్ని వార్తలు