82.56% శాతం పోలింగ్‌

11 May, 2019 09:14 IST|Sakshi

మిర్యాలగూడ : మిర్యాలగూడ డివిజన్‌లో శుక్రవారం ప్రాదేశిక ఎన్నికల మలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకో లేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఎండ వేడిమికి ఓటర్లు ఉదయమే ఎక్కువ మంది క్యూలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు డివిజన్‌లో మొత్తం 82.56 శాతం పోలింగ్‌ నమోదైంది.

మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పది మండలాల్లో 109 ఎంపీటీసీలకు గాను నాలుగు ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 105 ఎంపీటీసీ స్థానాలకు గాను 363 మంది అభ్యర్థులు, పది జెడ్పీటీసీ స్థానాలకు 51మంది మొత్తం 414 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పది మండలాల్లో పురుషులు 1,49, 020 మంది, మహిళలు 1,51,331 మంది,  ఇతరులు ఆరుగురు, మొత్తం 3,00,357 మంది ఓటర్లు ఉండగా 2,47,988 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.


అత్యధికంగా మాడుగులపల్లిలో పోలింగ్‌ 
డివిజన్‌లో అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో పోలింగ్‌శాతం నమోదైంది. మొత్తం డివిజన్‌లో 82.56 శాతం పోలింగ్‌ కాగా అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో 88.47 శాతం, అతి తక్కువగా అనుముల మండలంలో 79.01 శాతం పోలింగ్‌ నమోదైంది.

భారీ బందోబస్తు
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. డివిజన్‌లోని పది మండలాల్లో 1551 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.  ఎస్పీ రంగనా«థ్‌ మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం శెట్టిపాలెం, అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని పోలింగ్‌ స్టేషన్లను, అనుముల మండలం కొత్తపల్లి పోలింగ్‌ స్టేషన్‌ను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు చంపాలాల్‌ నిడమనూరు మండలంలోని నారమ్మగూడెం పోలింగ్‌ స్టేషన్‌ను పరిశీలించారు.

ఎండ వేడిమి వల్ల ఉదయమే ఎక్కువ పోలింగ్‌
వేసవిలో ఎండ వేడిమి వల్ల ఉదయం వేళలోనే ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కావడం వల్ల మద్యాహ్నం 1 గంట వరకే డివిజన్‌లో 63.24 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 44 డిగ్రీల ఎండ వేడిమిలో కూడా ఓటర్లు బారులుదీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

>
మరిన్ని వార్తలు