ఓడి.. గెలిచారు!

5 Jun, 2019 12:16 IST|Sakshi
విజయ చిహ్నం చూపుతున్న నాగర్‌కర్నూల్‌ జెడ్పీటీసీ శ్రీశైలం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. ఇందులో కొంత మంది భారీ మెజారిటీతో గెలుపొందగా.. మరికొందరు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. ఈ క్రమంలోనే సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పలువురు అభ్యర్థులు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.. ఇక్కడ సానుభూతో.. మరే ఇతర కారణం చెతనో వారు గెలుపు తీరాలకు చేరుకున్నారు. విశేషమేమిటంటే.. ఐదు నెలల వ్యవధిలోనే ఓటర్ల తీర్పు మారడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

నాగర్‌కర్నూల్‌: నియోజకవర్గంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమిపాలైన పలువురు అభ్యర్థులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపొంది ఔరా అనిపించారు. మండలంలోని పెద్దముద్దునూరు గ్రామానికి చెందిన చిక్కొండ శ్రీశైలం సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అయితే మండలం జెడ్పీటీసీ బీసీ జనరల్‌ స్థానానికి కేటాయించడంతో జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అలాగే తాడూరు మండల కేంద్రానికి చెందిన మల్లయ్య సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఎంపీటీసీలో జనరల్‌ మహిళకు రిజర్వేషన్‌ రావడంతో తన భార్య రేణుకను పోటీలో ఉంచగా 1,100 ఓట్ల మెజారిటీతో గెలిచింది. బిజినేపల్లి మండలం పాలెంకు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ సర్పంచ్‌ ఎన్నికల్లో తన భార్య సుమలతను బరిలో నిలపగా ఓటమిపాలైంది. ప్రస్తుతం  శ్రీనివాస్‌గౌడ్‌ ఎంపీటీసీగా పాలెం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 

ఎంపీటీసీలుగా నలుగురు.. 
ఉప్పునుంతల (అచ్చంపేట): మండలంలో నలుగురు అభ్యర్థులు గత సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటమిని చవిచూసి తిరిగి ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఉప్పునుంతల సర్పంచ్‌గా ఓడిపోయిన అరుణ ప్రస్తుతం ఉప్పునుంతల–1 స్థానం నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. అలాగే ఉప్పునుంతల–2 నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన వెంకటేష్‌ గత సర్పంచ్‌ ఎన్నికల్లో దేవదారికుంటతండా సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయారు. ఫిరట్వానిపల్లి ఎంపీటీసీగా ప్రస్తుతం గెలుపొందిన మల్లేష్‌ భార్య గత సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయింది. జప్తీసదగోడు ఎంపీటీసీ గెలుపొందిన ఇటిక్యాల కవిత భర్త తిర్పతిరెడ్డి గత సర్పంచ్‌ ఎన్నికల్లో ఓడిపోయారు. బల్మూరు మండలం రామాజిపల్లిలో సర్పంచ్‌గా ఓడిపోయిన శాంతమ్మ ప్రస్తుతం ఎంపీటీసీగా మండలంలోనే 785 ఓట్ల  భారీ మెజారిటీతో గెలుపొందారు.

సర్పంచ్‌గా ఓడి.. జెడ్పీటీసీగా.. 
కొల్లాపూర్‌: నియోజకవర్గంలో పలువురు అభ్యర్థులు సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటమి చవి చూసి, ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందారు. పెంట్లవెల్లి జెడ్పీటీసీగా గెలుపొందిన చిట్టెమ్మ సర్పంచ్‌ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందారు. అలాగే పెద్దకొత్తపల్లి మండల జెడ్పీటీసీగా గెలుపొందిన గౌరమ్మ కూడా గత సర్పంచ్‌ ఎన్నికల్లో మారెడుమాన్‌దిన్నె గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. మల్లేశ్వరం సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటమి చెందిన ఈశ్వరమ్మ ఇప్పుడు అదే గ్రామ ఎంపీటీసీగా గెలిచింది. చెన్నపురావుపల్లి సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయిన రామచంద్రయ్య ప్రస్తుతం ఎంపీటీసీగా గెలుపొందారు. లచ్చనాయక్‌తండా సర్పంచ్‌గా ఓడిన నిరంజన్‌నాయక్‌ తనయుడు ఇప్పుడు పాండునాయక్‌ నార్లాపూర్‌ ఎంపీటీసీగా గెలిచారు. చంద్రకల్‌ సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటమి చెందిన సీపీఐ నాయకులు బాల్‌నర్సింహ భార్య ఇందిరమ్మ ఇప్పుడు ఎంపీటీసీగా గెలిచారు. మాచినేనిపల్లి సర్పంచ్‌ సుధారాణి సింగోటం ఎంపీటీసీగా గెలిచారు. ఆమె కొల్లాపూర్‌ ఎంపీపీ పదవి చేపట్టబోతున్నారు. ఆమె ఎంపీపీగా గెలవడంతో త్వరలోనే సర్పంచ్‌ పదవికి రాజీనామా చేయనున్నారు.

వెల్దండ: మండలంలోని అజిలాపూర్‌లో లక్ష్మమ్మ సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎంపీటీసీగా అవకాశం రావడంతో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అలాగే వెల్దండకు చెందిన విజేందర్‌రెడ్డి సర్పంచ్‌గా ఓడిపోగా.. ఎంపీటీసీ జనరల్‌ మహిళ రిజర్వేషన్‌ కావడంతో ఆయన భార్య ఉమ పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. బొల్లంపల్లిలో సర్పంచ్‌గా వెంకట్‌రెడ్డి భార్య ఓటమి చెందారు. వెంకట్‌రెడ్డి బొల్లంపల్లి కాంగ్రెస్‌ ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందగా.. నగారగడ్డతండా సర్పంచ్‌ జైపాల్‌నాయక్‌ పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. చెదురుపల్లి ఎంపీటీసీగా టీఆర్‌ఎస్‌ నుంచి జైపాల్‌నాయక్‌ భార్య విజయ ను పోటీలో ఉంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. 

441 ఓట్ల మెజారిటీతో..

ఊర్కొండ (కల్వకుర్తి): మండలంలోని మాధారం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌రెడ్డి గత ఎన్నికలలో సర్పంచ్‌గా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి నిఖిల్‌రెడ్డిపై 299 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. అయితే మే నెలలో జరిగిన మండల పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా మాధారం జనరల్‌కు కేటాయించడంతో, పార్టీ తిరిగి అరుణ్‌కుమార్‌రెడ్డిని ఎంపీటీసీ అభ్యర్ధిగా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన అల్వాల్‌రెడ్డిపై 441 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కల్వకుర్తి రూరల్‌: మండలంలోని తాండ్రకు చెందిన ఎల్లమ్మ గత సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసింది. ఓటమికి భయపడకుండా ఎంపీటీసీగా పోటీ చేసి ఘన విజయం సాధించింది. దీంతో సర్పంచ్‌గా ఓడిపోయినా ఎంపీటీసీగా గెలవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు