నా తోటే నాకు ముఖ్యం!

3 Jan, 2018 10:36 IST|Sakshi
సంతమాగులూరు మేజరకు గండిపెట్టడంతో రోడ్డుపై పారుతున్న సాగర్‌నీరు

మేజరుకు గండి కొట్టి సుబాబుల్‌ తోటలకు నీరు పెట్టుకుంటున్న ప్రబుద్ధుడు

సంతమాగులూరు: ఎవరేమైపోతే మాకేంటి.. మా తోటలకు నీరు కట్టుకుంటే చాలు అన్న చందంగా ఉంది కొందరు రైతుల పరిస్థితి. కాలువ తూముల ద్వారా పొలాలకు, నీరు కడితే ఆలస్యం అవుతుందనుకున్నారేమో ఏమో, ఏకంగా ఫత్తేపురం సమీపంలోని సంతమాగులూరు మేజరుకు గండి కొట్టి సుబాబుల్‌ తోటలకు నీరు కడుతున్నారు. దీంతో నీటి కోసం ఎదురు చూస్తున్న కంది, శనగ, మిరప, పత్తి రైతులు లబోదిబోమంటున్నారు. ఫత్తేపురం సమీపంలోని సంతమాగులూరు మేజరుకు ఇదే గ్రామానికి చెందిన ఓ రైతు గండి కొట్టి సుబాబుల్‌ తోటలకు నీరు తరలిస్తున్నాడు. దీంతో మేజరు నుంచి వెళ్లే నీరు రహదారిపైగా ప్రవహిస్తుండడంతో, రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

అధికారుల అండదండలతోనే?
ఏకంగా సాగరు మేజరు కాలువకు గండి కొట్టి, సుబాబుల్‌ తోటలకు నీరు కడుతున్నరంటే, దాని వెనుక అధికారుల అండదండలు లేకుండా ఉన్నాయా? అని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు కల్పించుకుని మేజరుకు కొట్టిన గండిని పూడ్పించాలని కోరుతున్నారు. దీనిపై ఎన్‌స్పీ జేఈ తేజశ్వనిని వివరణ కోరగా ఈ విషయం తనకు తెలియదని వెంటనే సిబ్బందిని పంపించి గండిని పూడ్చుతామని వివరించారు.

మరిన్ని వార్తలు