చీరాల ఇరిగేషన్‌లో రచ్చకెక్కిన విభేదాలు

5 Mar, 2019 13:29 IST|Sakshi
డ్రైనేజీ ఈఈ వేధింపులు తాళలేకున్నామని మీడియా ముందు వాపోతున్న ఉద్యోగులు (ఫైల్‌)

ఇరిగేషన్‌ చీరాల ఈఈ తీరుతో ఉద్యోగుల బేజారు

యూడీసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన ఈఈ

చొక్కా పట్టుకొని కర్రతో కొట్టాడని ఈఈపై యూడీసీ ఫిర్యాదు

ఈఈ తమను వేధిస్తున్నారంటున్న మహిళా ఉద్యోగులు 

మూడు రోజుల తరువాత ఇరువర్గాలపై కేసులు నమోదు

చర్యలు తీసుకోకుంటే మూకుమ్మడి సెలవులు పెడతామంటున్న సిబ్బంది

సాక్షి, చీరాల: చీరాల ఇరిగేషన్‌ కార్యాలయంలో ఈఈ కి, సిబ్బందికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.  ఇరిగేషన్‌ డ్రైనేజీ డివిజన్‌ కార్యాలయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ బి.వెంకటరాజు కార్యాలయం యూడీసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. మిగిలిన ఉద్యోగులపై కూడా అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. తాను చెప్పిన పనులు చేయడం లేదని, ఏదైనా చెబితే ఎదురు మాట్లాడుతున్నారని, అందుకే తాను కులం పేరుతో తిట్టాడని యూడీసీ హేమంత్‌కుమార్‌పై అట్రాసిటీ కేసు పెట్టానని ఉన్నతాధికారులకు ఈఈ చెప్పుకున్నట్లు సమాచారం. నిత్యం తమను పిలిపించి కాంట్రాక్టర్లు, ఉన్నతోద్యోగుల ముందు అవమానకరంగా మాట్లాడుతూ ఈఈ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని యూడీసీ కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈఈ అకారణంగా తమను దుర్భా​​​​​షలాడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఉద్యోగులు సైతం చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం యూడీసీపై వేధింపులకు పాల్పడటంతో పాటుగా చొక్కా పట్టుకుని దుర్బాషలాడుతూ కర్ర తీసుకొని ఈఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఉద్యోగులంతా ఈఈని ప్రశ్నించారు. ఈఈ మాత్రం తనను యూడీసీ కులంపేరుతో దూషించి దాడికి యత్నించాడని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి అట్రాసిటీ కేసు పెట్టినట్లు చెబుతున్నారు.

యూనియన్‌ నాయకులను కలిసిన సిబ్బంది

ఇరిగేషన్‌ చీరాల డివిజన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి బండి శ్రీనివాసరావును ఒంగోలులో కలిసి ఈఈ ఆగడాలను, వేధింపులను వివరించారు. దీనిపై ఎన్జీవో నేతలు ఈఈతో మాట్లాడితే యూడీసీపై పెట్టిన కేసును మాత్రం వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పాడు. తాను ఇచ్చిన కేసు రిజిస్టర్‌ చేయాల్సిందేనని డీఎస్పీ వద్ద పట్టుబట్టాడు.

ఉన్నతాధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ?

కింది స్థాయి ఉద్యోగులు సరిగా పనిచేయకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని, సంవత్సర కాలంగా ఉన్నతాధికారులను సైతం తిట్టుకుంటూ తమపై అరాచకంగా ఈఈ ప్రవర్తిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఆయన అనారోగ్యంతో బాధ్యతలు తీసుకున్నాడని, ఇరిగేషన్‌ గెస్ట్‌హౌస్‌లోనే సంవత్సరం అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఉద్యోగులు తెలిపారు. ప్రతి చిన్న విషయానికి ఫైళ్లు తీసుకుని గెస్ట్‌హౌస్‌లోకి తాము వెళ్లాల్సి వస్తుందని, ఏదో ఒక వంక చూపించి తిట్టడం పరిపాటిగా మారిందని ఉద్యోగులు తెలిపారు. పొన్నూరులో పనిచేస్తున్న ఏఈ నాగేశ్వరావు ప్రతి నిత్యం ఈఈ కార్యాలయంలోనే ఉంటూ ఎస్టాబ్లిష్‌మెంట్‌ క్లర్క్‌ చేయాల్సిన పనులన్నీ తాను చేస్తూ కార్యాలయంలో ఎవ్వరికీ ఏ పనీ చేతకాదని చాడీలు ఈఈకి చెబుతున్నాడని ఉద్యోగులు వాపోతున్నారు. చీరాల డ్రైనేజీ ఈఈ నుంచి తమకు రక్షణ కల్పించాలని లేకుండా ఉమ్మడి సెలవులు పెడతామని ఉద్యోగులు అంటున్నారు.

యూడీసీని తిట్టిన మాట వాస్తవమే కానీ..
చీరాల డ్రైనేజీ కార్యాలయంలో పనిచేస్తున్న యూడీసీ హేమంత్‌కుమార్‌ బిల్లుల విషయంలో నన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఐటీ రిటన్స్‌ విషయంలో ఈఈగా నాకు అధికారం లేదు. ఈ విషయమై యూడీసీతో మాట్లాడుతూ పనిలో నిబద్దత ఉండాలని, పనికిమాలిని పనులు చేయవద్దని తిట్టిన మాట వాస్తవమే. అయితే యూడీసీ మాత్రం తనను బూతులు తిట్టడంతో పాటుగా దాడికి యత్నించి కులం పేరుతో దూషించాడు. సిబ్బంది పనితీరు మార్చుకోవాలని సూచిస్తే నాపై దాడికి యత్నించి, కులం పేరుతో దూషించాడు. అందుకే అట్రాసిటీ కేసు పెట్టా. పనిచేయని ఉద్యోగులు ఎవ్వరినీ విడిచి పెట్టను.
-బి.వెంకటరాజు, డ్రైనేజీ ఈఈ, చీరాల.

మరిన్ని వార్తలు