ఆదర్శ జ్యోతి

13 Feb, 2018 12:37 IST|Sakshi

పట్టుపురుగుల పెంపకంలో విశేష అనుభవం

వందలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ఆకవీటి జ్యోతి

జాతీయ స్థాయిలో పలు అవార్డులు

ఇంట్లో మగవారే సంపాదించాలి. ఆడవాళ్లు ఇంటి పనులకే పరిమితమవ్వాలి...చాలా కుటుంబాల్లో కనిపించేది ఇదే. కానీ భర్త ప్రభుత్వోద్యోగి అయినా ఆయనపై ఆధారపడకుండా తనకంటూ ఉపాధి ఉండాలనుకున్నారు కంభానికి చెందిన ఆకవీటి జ్యోతి.  ఇంటర్మీడియెట్‌ వరకే చదువుకున్నా.. పట్టుపురుగుల పెంపకంలో మెళకువలు నేర్చుకున్నారు. మరికొంత మంది ఆడవాళ్లకు ఉపాధి చూపుతున్నారు. వందలాది మంది రైతులు మల్బరీ తోటలు సాగుచేసేందుకు దారి చూపారు. సాగులో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు, నాణ్యమైన ఆకుల దిగుబడి తదితర అంశాల్లో జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. ఆమె విజయగాథపై ‘సాక్షి’ కథనం.

పట్టుదల, కృషి.. విజయానికి సోపానాలు. ఈ మాటను అనేకమార్లు విని ఉంటారు! ఎన్నో చోట్ల చదివుంటారు! ఆకవీటి జ్యోతి జీవితంలో కృషి, పట్టుదల అడుగడుగునా కనిపిస్తాయి. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి.. ఇంట్లోనే ఉంటూ కుటుంబ ఆలనాపాలనా చూసుకుంటూ కాలం గడిపేయొచ్చు. కానీ ఆమె అలా ఆలోచించలేదు. స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకుంది. తోటి మహిళలకు ఉపాధి కల్పించాలని భావించింది. పట్టుపరిశ్రమ శాఖలో పనిచేస్తున్న తన భర్త నుంచి పట్టుపురుగుల పెంపకంలో మెళకువలు నేర్చుకుంది. తన లక్ష్యం వైపు అడుగులేసి విజయం సాధించింది.  

ప్రకాశం , కంభం : పట్టుపురుగుల పెంపకంలో విశేష అనుభవాన్ని గడించడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది కంభం పట్టణానికి చెందిన ఆకవీటి జ్యోతి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇంటర్మీడియెట్‌ వరకు చదువుకున్న జ్యోతిది వ్యవసాయ కుటుంబం కాదు. భర్త సుబ్రహ్మణ్యం పట్టు పరిశ్రమల శాఖలో పనిచేస్తుండటంతో ఆ రంగంపై ఆసక్తి పెంచుకుని భర్త ద్వారా పట్టుసాగులో మెళకువలు నేర్చుకుంది. తద్వారా గిద్దలూరు నియోజకవర్గంలో వందల మంది రైతులు మల్బరీ సాగులో సాంకేతిక విప్లవం సాధించడంలో ఎనలేని పాత్ర పోషించింది. మల్బరీ సాగులో సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, నాణ్యమైన ఆకుల దిగుబడి తదితర అంశాల్లో సాధించిన ప్రగతికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ప్రశంస పత్రాలు, అవార్డులు అందుకుంది.

రైతు సేవలో..
మైసూర్‌లోని జాతీయ పట్టు పరిశోధనా సంస్థలో వారం రోజులపాటు శిక్షణ తీసుకున్న జ్యోతి.. 2005లో కంభంలో పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. రైతులకు అవగాహన కల్పించడం కోసం విజ్ఞాన యాత్రలు, శిక్షణలు, యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ నిరంతరం వారి అభివృద్ధికి సహకారం అందిస్తోంది. జిల్లాలో 2 వేల ఎకారాల్లో మల్బరీ సాగవుతుండగా కంభం, బేస్తవారిపేట మండలాల్లో 350 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. హిందూపురం, ధర్మవరం, కదిరి, పలమనేరు, మదనపల్లి మార్కెట్‌లో ప్రస్తుతం పట్టు క్వింటా ధర రూ.40 వేల నుంచి రూ.50 వేలు పలుకుతోంది. ఈ లెక్కన రైతులు ఒక పంటకు పురుగుల పెంపకం సంఖ్యను బట్టి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. 24 రోజుల్లో పూర్తయ్యే పట్టుపురుగుల పెంపకంలో మొదటి 8 రోజులు పురుగులను పొదిగించి, ఆ తర్వాత వాటికి ఆహారం అందించాలి. నిర్ధిష్టమైన వాతావరణ పరిస్థితులతోపాటు పరిశుభ్రత పాటించడం అవసరం. ఈ విషయాలపై రైతులకు సూచనలివ్వడమే కాకుండా తానూ పాటిస్తుంది. జ్యోతి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల రైతులు రావడం విశేషం. జ్యోతి చాకీ పట్టు పురుగుల కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 15–20 మంది నిత్యం ఉపాధి కల్పిస్తుండగా.. పరోక్షంగా వందలాది మంది రైతు కూలీలకు, రైతులకు ఉపాధి దొరుకుతోంది.

పట్టు సాగుపై రైతులు ఆసక్తి చూపాలి
నీటి సౌకర్యం కలిగిన రైతులు మల్బరీ సాగుపై ఆసక్తి చూపాలి. మల్బరీ సాగు వల్ల ప్రతి నెలా ఆదాయం వస్తుంది. ఆసక్తి ఉన్న రైతులకు సహకారం అందిస్తాం.  రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుంది. ఆర్‌కేవీవై పథకం కింద రూ. రూ.1,37,500, సీడీపీవీ పథకం కింద రూ.80,500, ఎస్సీ రైతులకు రూ.2 లక్షలు, పరికరాలకు రూ.20 వేలు, గది నిర్మాణానికి రూ.22 వేలు, కూలింగ్‌ సిస్టంకు రూ.9,750, మల్బరీ మొక్కలు ఎకరాకు రూ.10,500, వ్యాధి నిరోధక మందులు, వేపపిండికి 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. రైతులు మల్బరీ సాగుకు ముందుకు వస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. – ఆకవీటి జ్యోతి

వరించిన అవార్డులు
2007లో జాతీయ స్థాయిలో ఏపీ తరఫున ఉత్తమ మహిళా అవార్డు, 2011లో రైతేరాజు అవార్డు, అదే ఏడాది దూరదర్శన్‌ సంస్థ నుంచి ఉత్తమ అవార్డు, 2012లో రాష్ట్ర స్థాయి అవార్డు, 2013లో అప్పటి గవర్నర్‌ సతీమణి విమలా నరసింహన్‌ చేతులమీదుగా ఉత్తమ మహిళా అవార్డు, అదే ఏడాదిలో పట్టుసిరి అవార్డు, 2015లో పట్టు పరిశ్రమ శాఖ నుంచి ఉత్తమ అవార్డును జ్యోతి అందుకుంది.

మరిన్ని వార్తలు