నిర్లక్ష్యం ఖరీదు కోటిన్నర!

1 Jan, 2018 10:58 IST|Sakshi

ఆర్‌అండ్‌బీ నిర్లక్ష్యంతో టెలికం కేబుల్‌ ధ్వంసం

 శాఖల మధ్య సమన్వయ లోపం

రోడ్డు విస్తరణ పనుల్లో ప్రజాధనం వృథా

కర్నూల్‌రోడ్డులో  5 కి.మీ పొడవున ధ్వంసమైన కేబుళ్లు  

 రూ.1.50 కోట్ల మేర నష్టం

 నెల రోజులుగా మూగబోయిన ఫోన్లు, బ్రాడ్‌బాండ్‌ సేవలు

తమ ఇబ్బందులు పట్టించుకోని అధికారులపై స్థానికుల ఆగ్రహం

చీమకుర్తి రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెండు బాధ్యతాయుతమైన శాఖల మధ్య కొరవడిన సమన్వయం తీవ్ర నష్టానికి కారణమైంది. కోట్లాది రూపాయల విలువైన కేబుల్‌ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఒంగోలు నగరం నుంచి కర్నూలు రోడ్డును ఫోర్‌లైన్‌గా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ పనుల్లో భాగంగా ఆర్‌అండ్‌బీ అధికారులు ఒంగోలు బైపాస్‌ సమీపంలోని నవభారత్‌ భవనాల నుంచి పేర్నమిట్ట సంతనూతలపాడు వైపునకు సుమారు 5 కి.మీ పొడవునా రోడ్డును తవ్వేశారు. విచక్షణా రహితంగా తవ్వేయడంతో మార్జిన్‌ కింద ఉన్న టెలికం రంగానికి చెందిన కోట్ల విలువ చేసే కేబుల్‌ వైర్లు ధ్వంసమయ్యాయి.

 బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన విలువైన కేబుల్‌ పూర్తిగా ధ్వంసమైందని టెలికం అధికారులు వాపోతున్నారు. ఆర్‌అండ్‌బీ, టెలికం రంగాలకు చెందిన రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే టెలికం కేబుల్‌ ధ్వంసం కావడానికి కారణంగా కనిపిస్తోంది. ఒంగోలు అంజయ్యరోడ్డు, పేర్నమిట్ట పరిధిలోనున్న టెలికం కార్యాలయాలకు చెందిన కేబుల్‌ కర్నూల్‌ రోడ్డులో ఎక్కువగా ఉంది. ధ్వంసమైన కేబుల్‌ విభాగాల్లో 200 పెయిర్, 100, 20, 15 పెయిర్‌ కేబుల్స్‌ ఉన్నట్లు సాంకేతిక సిబ్బంది తెలిపారు. మెయిన్‌లైన్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్‌ లైన్ల నుంచి పక్కనున్న వీధులకు సరఫరా చేసే కేబుల్స్‌ «ధ్వంసమైన వాటిలో ఉన్నాయన్నారు.

మూగబోయిన ఫోన్లు..
ధ్వంసమైన కేబుల్, మళ్లీ వాటిస్థానంలో ఏర్పాటు చేయాల్సిన కొత్త కేబుల్‌ విలువలే బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన వాటి విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉండొచ్చని, ఇక ప్రైవేటు రంగానికి చెందిన ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్‌ వంటి సంస్థలకు చెందిన కేబుల్స్‌ విలువ మరో రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా. వాటితో పాటు నెల రోజులుగా కేబుల్‌ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం కావడంతో వాటి పరి«ధిలోనున్న ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లు, బ్రాడ్‌బాండ్‌లు, సెల్‌ఫోన్‌లు వేల సంఖ్యలో మూగబోయినట్లు వినియోగదారులు వాపోతున్నా రు. వాటి ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని టెలికం కంపెనీలకు రెవెన్యూ ద్వారా సుమారు మరో రూ.50 లక్షలు ఆదాయాన్ని కోల్పోయినట్లు ఆయా శాఖల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన కేబుల్‌కు పరిహా రాన్ని ఆర్‌అండ్‌బీ డిపార్టుమెంట్‌ నుంచి వసూలు చేసుకోవచ్చా..? రోడ్డు విస్తరణలో  టెలికం వారికి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా..? అనే అంశాలపై ఆర్‌అండ్‌బీ అధికారుల వద్ద స్పష్టత లేకపోవడం గమనార్హం. నెల రోజుల పాటు ప్రజలకు అందాల్సిన టెలికం సేవలకు ప్రజలు పడిన అవస్థలకు ఎంత విలువ కడతారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు