‘ట్రిపుల్‌’ కష్టాలు

7 Feb, 2018 12:44 IST|Sakshi

ట్రిపుల్‌ ఐటీకి స్థలమివ్వని సర్కారు

ఇడుపులపాయలోనే తరగతులు

ఇక్కట్లలో విద్యార్థులు, ఫ్యాకల్టీ

ఎటూ పాలుపోని పరిస్థితి

జిల్లాలో స్థల కేటాయింపు, పక్కా భవనాల్లేవు

ఇడుపులపాయలో వీలు కాదంటున్న అధికారులు

స్పందించని ప్రభుత్వం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరుతో ట్రిపుల్‌ ఐటీ మంజూరు చేసినా జిల్లాలో వసతుల కల్పనను గాలికొదిలేయడంతో విద్యార్థుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. వసతుల లేమితో జిల్లాకు కేటాయించిన ట్రిపుల్‌ ఐటీని తరగతులను ప్రస్తుతం వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో నిర్వహిస్తున్నారు. దీంతో  రెండేళ్లుగా ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ ఇడుపులపాయలోనే నడుస్తోంది. 6 వేల మంది సామర్థ్యం మాత్రమే ఉన్న ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ప్రస్తుతం ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో కలిపి 8 వేల మంది ఉన్నారు. వచ్చే ఏడాది మరో వెయ్యి మంది పైనే విద్యార్థులున్నారు. ఈ లెక్కన మొత్తం విద్యార్థుల సంఖ్య 9 వేలకు చేరుతుంది. దీంతో ఇప్పటికే అక్కడ

వసతుల్లేవు. విద్యార్థులకు గదుల కొరతతో పాటు మంచాలు, కంప్యూటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఒంగోలు విద్యార్థులకు ట్యాబ్‌లిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందజేయలేదు. ఇక ఫ్యాకల్టీ కొరత వేధిస్తోంది. మరోవైపు ఉన్న ఫ్యాకల్టీ సైతం ఒంగోలు ప్రాంతానికి చెందినవారు కావడంతో ఇడుపులపాయలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. వారు ఉండేందుకు వసతుల్లేకపోవడంతో బయట ప్రాంతాలలో ఉండి బోధనకు ఇడుపులపాయకు వెళ్లాల్సి వస్తోంది. శని, ఆదివా రాలు సెలవు తీసుకోవాలన్న రెండు రోజుల వ్యవధిలో ఒంగోలు ప్రాంతానికి వచ్చి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఫ్యాకల్టీ సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విద్యార్థులది అదే పరిస్థితి. వసతుల లేమితో వారి చదువులు సజావుగా సాగడం లేదు. అయితే వసతుల లేమితో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అక్కడి అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పడంతో ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల పరిస్థితి ఆడకత్తెరలో పోకచెక్కలా మారింది.  

ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ పరిధిలో 2016–17 విద్యా సంవత్సరంలో వెయ్యి మంది విద్యార్థులు, 2017–18 విద్యాసంవత్సరంలో వెయ్యి మందితో పాటు సూపర్‌ న్యూమరరీ కోటా కింద మరో 114 మంది మొత్తం 2114 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ ప్రస్తుతం వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టు నెలలో మరో వెయ్యి సీట్లతో పాటు సూపర్‌ న్యూమరరీ కింద 140 సీట్లు మొత్తం 1140 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఈ లెక్కన ట్రిపుల్‌ ఐటీలో మొత్తం 3254 మంది విద్యార్థులవుతారు. అయితే వీరందరికీ అక్కడ తరగతులు నిర్వహించడం ఇబ్బందిగా మారింది. దీంతో అక్కడ అధికారులు ఒంగోలు ట్రిపుల్‌ ఐటీని ఒంగోలులోనే నిర్వహించుకోవాలంటూ ఒత్తిడి పెంచారు. ఇటీవల మీరు కచ్చితంగా వెళ్లాల్సిందేనంటూ మరింత ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఎటూ తేల్చని సర్కారు: ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి వంద ఎకరాలకుపైగా స్థలం కేటాయిస్తున్నట్లు అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఆ తర్వాత ఒంగోలు మండలం యరజర్ల కొండ ప్రాంతాన్ని ట్రిపుల్‌ ఐటీకి కేటాయిస్తున్నట్లు గతేడాది అక్టోబర్‌లో జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ సర్వే నెం.418లో 200 ఎకరాలకుపైగా స్థలాన్ని డి–నోటిఫై చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. ట్రిపుల్‌ ఐటీకి వంద ఎకరాలు కేటాయించనున్నట్లు చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో 2 వేల ఎకరాలకుపైగా భూములను ఇనుప ఖనిజం తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం లీజుకిచ్చింది. అయితే ఇందులోనే ట్రిపుల్‌ ఐటీకి స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించారు. అయితే ఇనుప ఖనిజం ఉన్న ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే భూములు కేటాయిస్తామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అయితే ఈ వ్యవహారం ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో ట్రిపుల్‌ ఐటీ స్థల కేటాయింపు, భవనాల నిర్మాణం ఇప్పట్లో జరిగేది కాదని తేలిపోయింది. తాత్కాలికంగా అద్దె భవనాల్లో ట్రిపుల్‌ ఐటీ తరగతులు నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించినా అది ముందుకు సాగలేదు. సరైన అద్దె భవనాలు దొరకలేదని ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు చేతులు దులుపుకున్నారు. దీంతో వచ్చే ఏడాది కూడా జిల్లాలో ట్రిపుల్‌ ఐటీ తరగతుల నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. ఇప్పటికే ఇడుపులపాయలో తరగతులు నిర్వహించటం కుదరదని అక్కడి అధికారులు తేల్చి చెబుతున్న నేపథ్యంలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల భవితవ్యం గందరగోళంలో పడింది. ఈ పరిస్థితుల్లో అధికారులు ఏం చేస్తారన్నది వేచి చూడాల్సిందే...!

ఇడుపులపాయలో మరింత ఇబ్బందిగా ఉంది..
6 వేల మంది విద్యార్థుల సామర్థ్యం ఉన్న ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ఇప్పటికే విద్యార్థులు 8 వేల మంది ఉన్నారు. దీంతో విద్యార్థులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాకల్టీ సైతం కష్టాలు పడాల్సి వస్తోంది. తక్ష ణం ఒంగోలులో ట్రిపుల్‌ ఐటీకి స్థల కేటాయిం పు లేదా తాత్కాలికంగానైనా అద్దె భవనాలు చూడాలని ప్రభుత్వానికి విన్నవించాం. కానీ ఇంత వరకు సమస్య పరిష్కారం కాలేదు. వచ్చే ఏడాది మరో వెయ్యి మంది విద్యార్థులు పెరుగుతారు. దీంతో మరిన్ని ఇబ్బందులు తప్పవు. ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి వచ్చే ఏడాదికైనా తరగతులు నిర్వహించుకునేలా ప్రయత్నించాలి.  – వెంకట బసవరావు,ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌

Read latest Prakasam News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు