సమస్యలు పరిష్కరించండయ్యా..

30 Jan, 2018 12:55 IST|Sakshi
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జేసీ నాగలక్ష్మి, పక్కన ఇతర అధికారులు

మీకోసంలో ఉన్నతాధికారులకు ప్రజల వేడుకోలు

ఒంగోలు టౌన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు జిల్లా ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన మీకోసంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌–2 మార్కండేయులు, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

జీఓలు అమలు చేయాలి
జిల్లాలోని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ఏడురకాల జీఓలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు సీహెచ్‌ మజుందార్, కార్యదర్శి కె.శ్రీనివాసరావు కోరారు. పర్మినెంట్‌ పంచాయతీ కార్మికులకు 010 పద్దు కింద జీతాలు చెల్లించేందుకు, టెండర్‌ విధానం రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టు పద్ధతిన కనీస వేతనం ఇచ్చి వారినే కొనసాగించాలని, ఎన్‌ఎంఆర్, పార్ట్‌టైం, ఫుల్‌టైమ్‌ కాంట్రాక్టు పద్ధతిన పంచాయతీల్లో పనిచేస్తున్న అర్హుల జాబితా తయారు చేసి కమీషనరేట్‌కు పంపించడం తదితర వాటికి సంబంధించిన జీఓలను జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి పంపించలేదని పేర్కొన్నారు.

నివేశన స్థలాలు కేటాయించాలి
చినగంజాం మండలం చినగంజాం, కడవకుదురు, చింతగుంటల గ్రామాల్లో అర్హులైన 400 మందికి నివేశన స్థలాలు ఇవ్వాలని ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు వేడుకున్నారు. సర్వే నం 828, 128, 129లో ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. కూలీనాలి చేసుకొని జీవించే తమకు ఇళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో స్థలాలు ఇవ్వమని స్థానిక తహసీల్దార్‌ను వేడుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. మీరైనా న్యాయం చేసి ఇళ్లు ఇప్పించాలని కోరారు.

హేచరీలపై చర్యలు తీసుకోవాలి
నాసిరకం రొయ్య పిల్లలు తయారు చేస్తున్న హేచరీలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండవ శ్రీనివాసరావు, దుగ్గినేని గోపీనా«థ్‌ కోరారు. తీర ప్రాంతాల్లోని 20 వేల హెక్టార్లలో రైతులు వెనామీ రకం రొయ్య సాగు చేస్తున్నారన్నారు. 36 వెనామీ రకం రొయ్య పిల్లలను తయారు చేసే హేచరీలు ఉన్నాయని, వీటి నుంచి రైతులు రొయ్య పిల్లలను కొనుగోలు చేసి వారి చెరువుల్లో సాగు చేస్తారన్నారు. రెండేళ్ల నుంచి కొన్ని హేచరీలు నాసిరకం రొయ్య పిల్లలు తయారు చేసి రైతులకు అమ్ముతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఒక్కో రైతు ఎకరాకు 3 లక్షల రూపాయల వరకు నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు. హేచరీలపై నిఘా ఉంచి నాణ్యమైన రొయ్య పిల్లలను అందించేలా చూడాలని కోరారు.

బట్వాడాలు ఆగిపోయాయి
మార్కాపురంలోని పలకల కార్మికులను ఆదుకోవాలని మార్కాపురం డిజైన్‌ స్లేట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కోరారు. మార్కాపురంలో తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పలకల పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. పలకల యజమానులు తాము ఎగుమతి చేసిన సరుకు తాలూకు హెడ్‌ఫారం సకాలంలో అందజేయలేదన్న సాకుతో పరిశ్రమ బ్యాంకు ఖాతాలను హోల్డ్‌లో పెట్టారన్నారు. దీంతో కార్మికులకు నెల రోజులకు పైగా బట్వాడాలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అకౌంట్స్‌ను హోల్డ్‌లో పెట్టిందని ఫిర్యాదు చేశారు.

మౌలిక వసతులు కల్పించాలి
ఒంగోలు నగరం 50వ డివిజన్‌ జయప్రకాష్‌ ఎక్స్‌టెన్షన్‌ కాలనీలో నివాసం ఉంటున్న తమకు మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు వేడుకున్నారు. తమ కాలనీ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ దుర్బర జీవితాన్నే గడుపుతున్నామన్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రోడ్డు లేకపోవడంతో గుంటల నుంచి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నట్లు వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల మధ్యే మురుగునీరు నిలిచి వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. తమ కాలనీకి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

మిరప పంటను వైరస్‌ కాటేసింది
మిరప పంటకు జెయిని వైరస్‌ వ్యాపించి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని యర్రగొండపాలెం మండలం వీరభద్రాపురానికి చెందిన రైతులు వాపోయారు. గ్రామంలో 300 ఎకరాల్లో మిరప పంట సాగు చేశామని, పూత పిందె దశలో ఒక్కసారిగా తామర పురుగు, నల్లి, తెల్లదోమ వ్యాపించడంతో పూర్తిగా దెబ్బతిందన్నారు. ఒక్కో రైతుకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 5 క్వింటాళ్లకు మించి రాలేదన్నారు. ఇప్పటికే 100 ఎకరాల్లో పంట తీసివేయడం జరిగిందన్నారు. తమ పంటకు నష్టపరిహారం నమోదు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు.

మరిన్ని వార్తలు