పోలీసుల ఓవరాక్షన్‌

2 Feb, 2018 12:05 IST|Sakshi
ఎన్‌జీఓ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి శరత్‌బాబును అడ్డుకుంటున్న పోలీసులు

ఒంగోలు టౌన్‌: ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం సాయంత్రం ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ నిర్వహించనున్న సమీక్ష సమావేశ కార్యక్రమంలో పోలీసుల ఓవరాక్షన్‌ చేశారు. కలెక్టరేట్‌ ఇన్‌ గేట్‌ దాటి అడుగు లోపలికి పెట్టిన వెంటనే అక్కడ పోలీసులు చైన్‌ ఆకారంలో నిల్చొని ఏ ఒక్కరినీ సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలువైపునకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కమిషన్‌ చైర్మన్‌ వార్తను కవరేజ్‌ చేసేందుకు వచ్చిన మీడియాను కూడా మధ్యలోనే అడ్డగించారు. లోపలికి వెళ్లేది లేదంటూ అడ్డుకున్నారు.

సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలు వైపు ఉన్న పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా వారిని అడ్డుకున్నారు. ఏపీఎన్‌జీఓ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కె.శరత్‌బాబును సైతం వైద్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వర్తించేందుకు తన మోటార్‌ బైక్‌పై వెళ్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు. అటువైపు వెళ్లేందుకు వీల్లేదంటూ ఆయనతో వాగ్వాదానికి దిగారు. తన కార్యాలయానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారంటూ ఎన్‌జీఓ అసోసియేషన్‌ కార్యదర్శి పోలీసులను ప్రశ్నించారు. సమావేశాన్ని కవర్‌ చేసేందుకు వచ్చిన మీడియాను మధ్యలోనే నిలువరించడంతో నిరసన తెలిపేందుకు కొంతమంది సిద్ధమయ్యారు. అదే సమయంలో కారెం శివాజీ కలెక్టరేట్‌లోకి రావడంతో పరిమిత సంఖ్యలో మీడియాను సమీక్ష సమావేశానికి అనుమతించారు.

మరిన్ని వార్తలు