ఆక్రమణల పర్వం

11 Jan, 2018 11:10 IST|Sakshi

రూ. కోట్ల భూములు కొల్లగొడుతున్నారు

అడ్డూ అదుపు లేకుండా  అధికార పార్టీ భూ ఆక్రమణలు 

ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్న వైనం

పొదిలిలో 60 ఎకరాలకుపైగా కబ్జా

సంతనూతలపాడులోనూ ఇదే తీరు

రూ.65 కోట్ల విలువైన భూములను సొంతం చేసుకున్న నేతలు

అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికారులు

విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి..

సాక్షి, ఒంగోలు: జిల్లాలో అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలు రోజుకొకటి చొప్పున బయటపడుతున్నాయి. ముఖ్యంగా సంతనూతలపాడు, మార్కాపురం నియోజకవర్గాల పరిధిలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను నేతలు కబ్జా చేసి అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు కొందరు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారు. అర్హులైన పేదలకు మాత్రం సెంటు భూమి కూడా దక్కే పరిస్థితి లేకుండాపోయింది. సంతనూతలపాడు మండలం పి.గుడిపాడు గ్రామానికి చెందిన సర్వే నంబరు 16/ఏలో 12.12 ఎకరాలు, సర్వే నెం.12/బీలో 18.97 ఎకరాలు డొంక పోరంబోకు భూమి ఉంది. దానిలో 16/1ఏలో 2.72 ఎకరాలు, 12/బీ2లో 1.80 ఎకరాలు కలిపి మొత్తం 4.52 ఎకరాల డొంక పోరంబోకును 2017 నవంబర్‌ 16న ఆన్‌లైన్‌లో చీమకుర్తి తహశీల్దార్‌గా పనిచేస్తున్న అశోక్‌వర్ధన్‌ చీమకుర్తి రెవెన్యూ కార్యాలయంలో ఎక్కించారు. 

ఆన్‌లైన్‌లోకి ఎక్కించిన రోజునే సంతనూతలపాడు మండల తహశీల్దార్‌గా పి.నీలకంఠేశ్వరరావు నూతనంగా విధులలో చేరారు. అప్పటి వరకు ఇన్‌ఛార్జిగా ఉన్న చీమకుర్తి తహశీల్దార్‌ అశోక్‌వర్ధన్‌ సంతనూతలపాడులో ఛార్జి ఇచ్చి డిజిటల్‌ కీ ఇవ్వకుండా చీమకుర్తిలో భూమిని ఎక్కించినట్లు తెలుస్తోంది. డిజిటల్‌ కీని మాత్రం నవంబర్‌ 23న సంతనూతలపాడు తహశీల్దార్‌కు అప్పగించారు. ఇదే విషయాన్ని ఈ నెల 6న పి.గుడిపాడులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఫిర్యాదులు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

చట్టాన్ని ధిక్కరించి దందా..
దీంతో పాటు 16/1ఏలో 2.40 ఎకరాలు, 16/ఏ3లో 2.18 ఎకరాల డొంక పోరంబోకు భూమిని 2015 అక్టోబర్‌ 30న అప్పటి తహశీల్దార్‌ ఆర్‌.ప్రభాకర్‌రావు ఆన్‌లైన్‌లో ఎక్కించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ చట్టాలు ప్రకారం.. డొంక పోరంబోకు, వాగులు, కుంటలకు చెందిన భూములను కన్వర్షన్‌ చేయకుండా ఆన్‌లైన్‌లో ఎక్కించకూడదు. ఒక వేళ ఎక్కించాలంటే వీఆర్‌ఓ, ఆర్‌ఐ, సర్వేయర్‌ రిపోర్ట్‌లు తీసుకొని దానిని ఆర్‌డీఓ ద్వారా కలెక్టర్‌ అనుమతి తీసుకుని మాత్రమే అనాధీనం (ఏడబ్లు్య) భూమిగా మార్చి ఎక్కించాలి. అసలు పోరంబోకు భూములను కలెక్టర్‌ సైతం కన్వర్షన్‌ చేయకూడదని మెమో నంబరు 865/ఎం1 తేదీ 1983లో ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. 

ఇన్ని చట్టాలు పోరంబోకు భూములకు రక్షణగా ఉంటే వాటిని కాపాడాల్సిన అధికారులే దగ్గరుండి బినామీల పేర్లుతో అడ్డగోలుగా భూములను అధికార ర్టీ నేతలకు ధారాదత్తం చేయడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. డొంకపోరంబోకు భూమి సంతనూతలపాడు–చీమకుర్తి మధ్య కర్నూల్‌ రోడ్డు ఫేసింగ్‌లో ఉంది. రోడ్డు ఫేసింగ్‌లో అక్కడ ఎకరం భూమి రూ.2 కోట్లు పలుకుతుంది. ఈ లెక్కన ఈ కుంభకోణం విలువ రూ.25 కోట్ల పైనే ఉంటుందని అంచనా. డివిజనల్‌ స్థాయి రెవెన్యూ అధికారి సైతం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. జరిగిన దానిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ ఆదేశాల మేరకు తహశీల్దారు ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఆక్రమించి.. ఆన్‌లైన్‌ చేశారు..
ఇటీవల పొదిలిలోనూ భూ ఆక్రమణలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి. పొదిలి పట్టణంలోనూ 50 ఎకరాల విస్తీర్ణంలోని చెరువును సైతం అధికార పార్టీ నేతలు ఆక్రమించారు. ఏకంగా పట్టాలు పొంది ఆన్‌లైన్‌లో సైతం ఎక్కించారు. దీని విలువ సుమారు రూ.20 కోట్లు ఉండవచ్చునని అంచనా. దీంతో పాటు పట్టణంలో పలు విలువైన స్థలాలను నేతలు ఆక్రమించి అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.40 కోట్ల విలువైన స్థలాలను అధికార పార్టీ నేత అమ్మినట్లు అధికార పక్షం నుంచే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూ ఆక్రమణలపై ఉన్నతాధికారుల విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.   
 

మరిన్ని వార్తలు