వీరింతే మారరంతే..!

29 Jan, 2018 10:37 IST|Sakshi

చీమకుర్తి మండలంలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువు

అడ్డుకోవాల్సిన అధికారులే పెద్దల అక్రమాలకు సంపూర్ణ సహకారం

పాస్‌పుస్తకాల్లోకి క్షణాల్లో ఎక్కుతున్న సర్కార్‌ సంపద

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఇప్పటికే రెండు సార్లు ఏసీబీ దాడులు

అయినా తగ్గని అధికారుల అడ్డగోలు అక్రమాలు

జీతం కంటే గీతం పెద్దది. సక్రమంగా డ్యూటీ చేస్తే కేవలం జీతం మాత్రమే. అదీ రూ.30 లేదా రూ.40 వేలకే పరిమితం. అదే దారి తప్పితే రాత్రికి రాత్రే రూ.లక్షలకు లక్షలు చేతిలో గుట్టుచప్పుడు కాకుండా వచ్చిపడతాయి. ఇంత చిన్న లాజిక్‌ తెలిశాక కష్టపడి పనిచేయాలని ఎవరైనా అనుకుంటారనుకుంటే పొరపాటే. కొంతమంది అధికారులు అడ్డదారులకు బాగా అలవాటు పడ్డారు. పరువుపోయినా ఫర్వాలేదు.. తుడిచేసుకుంటే పోతుంది. అంతేగానీ మొహమాటపడితే రూ.లక్షలు ఎలా వస్తాయనుకుంటున్నారు అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు. వారిలో ఉన్న ఈ బలహీనతను కొంతమంది బడాబడా నేతలు సద్వినియోగం చేసుకుంటున్నారు. అక్రమాలకు దారి చూపించి రాజకీయ అండదండలతో ప్రభుత్వ భూములను పెద్దోళ్ల పాస్‌పుస్తకాల్లోకి ఎక్కిస్తున్నారు.

చీమకుర్తి రూరల్‌: సంతనూతలపాడు మండంలం పి.గుడిపాడు సర్వే నంబర్‌ 12,16ల్లో మొత్తం 27 ఎకరాల వరకు డొంకపోరంబోకు భూమి ఉంది. దానిలో 4.52 ఎకరాలను ఇటీవల ఓ తహసీల్దార్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ సాయంతో ఆన్‌లైన్‌లో ఎక్కించేశారు. దాని వెనుక రూ.లక్షల్లో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఎక్కించిన భూములను రద్దు చేయాలని స్థానిక బీజేపీ నాయకుడు సంకే సుబ్బారావు ఇటీవల జన్మభూమి సభలో అధికారులకు అర్జీ ఇచ్చారు. అంతకు ముందు పనిచేసిన తహసీల్దార్‌.. 4.58 ఎకరాల డొంకపోరం బోకు భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించి ఎంచక్కా తనకు కావాలసింది తాను లాగేసుకొని బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. వాస్తవానికి ప్రభుత్వానికి చెందిన పోరంబోకు భూమిని ఆర్‌డీఓ, కలెక్టర్‌ ద్వారా కన్వర్షన్‌ చేయించిన తర్వాత అనాధీనంగా మార్చిన తర్వాతే ఆన్‌లైన్‌లో ఎక్కించాల్సి ఉంటుంది.

ఆ ప్రాసెస్‌ చేయాలంటే సంబంధిత గ్రామ వీఆర్‌ఓ, ఆర్‌ఐ, సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్‌ రిపోర్టులు పక్కాగా ఉండాలి. ఇవేమీ లేకుండా ఏకంగా ఆ ఇద్దరు తహసీల్దార్‌లు చకచకా రాత్రికి రాత్రే దాదపు 9 ఎకరాల డొంకపోరంబోకు భూమిని ఆన్‌లైన్‌లోకి ఎక్కించారు. విచిత్రం ఏమిటంటే చీమకుర్తి మండలం గోనుగుంటలో కంసలి మాన్యానికి చెందిన భూమిని స్థానిక రైతు అన్ను రాంబాబు తన పాస్‌పుస్తకంలోకి ఎక్కించమంటే కంసలి మాన్యాలు, పోరంబోకులకు పాస్‌పుస్తకాలు ఇవ్వకూడదని చెప్పింది కూడా ఆ తహసీల్దారే కావడం గమనార్హం. అలా ఎక్కించకూడదని చెప్పిన తహసీల్దార్‌ ఎకరాలకు ఎకరాల భూమిని ఎలా ఎక్కిం చారోనని అర్థంగాక స్థానికులు జుత్తుపీక్కుంటున్నారు.

ఎన్నో అక్రమాలు
చీమకుర్తిలోని సత్రాలకు చెందిన భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించాలని భూమికి సంబంధించిన కొందరు రెవెన్యూ అధికారులను కలిస్తే సత్రం ఆనవాళ్లు లేకుండా చేస్తే ఆన్‌లైన్‌లో ఎక్కిస్తామని రెవెన్యూ అధికారులే శకుని సలహాలు ఇచ్చారు. దాని ఫలితంగా రాత్రికి రాత్రి సత్రాన్ని కూల్చేసి రాగా మీడియాలో రావడంతో రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు కాస్త వెనక్కి తగ్గారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారులు మాత్రం పొలంగా చూపుతున్న స్థలాన్ని ఇంటి స్థలంగా చూపించి రిజిస్ట్రేషన్‌ చేశారు. దాని వెనుక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రూ.లక్షలు చేతులు మారినట్లు తెలుస్తోంది.
చీమకుర్తిలోనే కర్నూలు రోడ్డు ఫేసింగ్‌లోనే జంగంకుంటను ఆనుకొని సర్వే నంబర్‌ 36లో 2.28 ఎకరాల అనాధీనం భూమిని అడ్డదారిలో కొంతమంది గతంలో ఉన్న తహసీల్దార్‌ల సాయంతో పట్టాలు సృష్టించి పాస్‌పుస్తకాల్లోకి ఎక్కించారు. సర్వే నంబర్‌ 37లో జంగంకుంట, 449లో కోనేటి కుంట, 194, 286 సర్వే నంబర్లలో ఉన్న అక్కమ్మకుంట, పాపయ్యకుంటలకు చెందిన కుంట పోరంబోకు భూములకు రెవెన్యూ అధికారులే అందడండలందించి పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు అందించారు. ప్రభుత్వ భూములకు అధికారులే రక్షణగా నిలవాల్సి ఉంటే రెవెన్యూలోని లొసుగులను అడ్డం పెట్టుకొని అక్రమార్కులకు అనుకూలంగా పాస్‌పుస్తకాలు ఇస్తూ ఆన్‌లైన్‌లో ఎక్కిస్తూ భూములను అన్యాక్రాంతం చేస్తుంటే ఇక ప్రభుత్వ ఆస్తులకు రక్షణేముంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కేంద్రంగా అక్రమాలు
అవినితికి పెట్టింది పేరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం. సామాన్యుడు ఇంటి స్థలాన్ని, పొలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని వెళ్తే ఫీజు టు ఫీజు అంటూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే రెట్టింపు స్థాయిలో ఫీజులు వసూలు చేస్తూ వంట్లో వణుకు పుట్టిస్తున్నారు. ప్రభుత్వ భూములను రిజిస్టర్‌ చేయకూడదని రెవెన్యూ కార్యాలయం అధికారులు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి నివేదిక అందిస్తారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారులకు అవేమీ పట్టవు. అదేదో సినిమాలో చెప్పినట్లు డబ్బులు ఎవరిస్తే వారికి చార్మినార్‌నైనా రిజిస్ట్రేషన్‌ చేస్తామన్నట్లుగా చీమకుర్తిలోని వందల సంఖ్యలో ప్రభుత్వానికి చెందిన ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేసిన ఘనత చీమకుర్తి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికే దక్కుతుంది. ఇక ప్రభుత్వ పొలాలకు డబ్బులు అప్పగిస్తే చకచకా రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్నారు. వారి ఆగడాలు తట్టుకోలేకనే గత మార్చిలో ఒకసారి, అంతకు మందు ఏడాదిన్నర క్రితం మరోసారి ఏసీబీ అధికారులు చీమకుర్తి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై దాడులు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన అధికారులు తమ జీతాన్ని మరిచిపోయి పైసంపాదనకు అలవాటుపడ్డారు. అధికారులు ఇష్టానుసారం అక్రమాలకు పాల్పడటంపై ప్రజలు నెవ్వరపోతున్నారు. కంచె చేను మేసిందనే సామెతను సార్థకం చేసేలా అధికారుల వైఖరి ప్రజలను ఇబ్బందుల పాల్జేయడమే కాకుండా ప్రభుత్వానికి కూడా నష్టం కలిగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు