ఉత్తీర్ణతపై సమ్మెట..!

9 Feb, 2018 12:33 IST|Sakshi

సమ్మెటివ్‌–1 పది పరీక్షల్లో 2257 మంది ఫెయిల్‌

వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 185

అత్యధికంగా హిందీలో 1384 మంది ఫెయిల్‌

19 రోజుల్లో రానున్న ప్రీపబ్లిక్‌ పరీక్షలు

81 రోజుల షెడ్యూల్‌పైనే విద్యాశాఖ ఆశ

బోలెడు ప్రచారం చేసి.. ఎంతో హడావుడి చేసి.. భారీగా డబ్బు వెచ్చించి.. వెలుగులోకి తెచ్చిన సమ్మెటివ్‌ పరీక్షలు ఎంత మేర ఫలితాన్ని ఇచ్చాయని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారు కరువయ్యారు. పబ్లిక్‌ పరీక్షలకు హాజరుకానున్న పదో తరగతి విద్యార్థులను తాజా ఫలితాలు కలవర పెడుతున్నాయి. ముఖ్యంగా హిందీలో వందలాది మంది పాస్‌ కాలేకపోయారు. దీనికి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఒంగోలు:  సమ్మెటివ్‌–1 పది పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 457 ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ వంటి 12 రకాల ఉన్నత పాఠశాలల్లో 2257 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సా«ధించలేకపోయారు. ప్రతి పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ లక్ష్యాన్ని పెట్టుకుంది. కానీ సమ్మెటివ్‌ –1 పరీక్షల ఫలితాల్లో ఈ లక్ష్యాన్ని చేరుకున్న పాఠశాలల సంఖ్య 185 మాత్రమే కావడం గమనార్హం. అత్యధికంగా ద్వితీయ భాష అయిన హిందీలో 1384 మంది విద్యార్థులు ఫెయిల్‌ కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కలెక్టర్‌ అనుమతితో నిర్వహిస్తున్న 81 రోజుల షెడ్యూల్‌ ప్లాన్‌ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని యోచిస్తుండగా పలు పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఫెయిల్‌ కావడం అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితిని బహిర్గతం చేసింది.

2257 మంది ఫెయిల్‌: 2017 డిసెంబర్‌ 14 నుంచి 21వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 457 పాఠశాలలకుగాను 23183 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతుండగా వారిలో 23082 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 20825 మంది ఉత్తీర్ణులు కాగా, 2257 మంది పాస్‌ కాలేకపోయారు. అంటే ఉత్తీర్ణతాశాతం 89.16 మాత్రమే నమోదైంది. పాస్‌ అయిన వారిలో ఏ1 గ్రేడులను పరిశీలిస్తే తెలుగులో 3911, ఇంగ్లిషు–2176, గణితం–2755, హిందీ–2175, బయాలజీ–2064, ఫిజిక్స్‌–2631, సోషల్‌–2958 మంది రాణించారు. ఇక డి–2 గ్రేడ్‌ అంటే ఫెయిలైన విద్యార్థులను సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే తెలుగులో 505 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇంగ్లిషులో 313, గణితం–663, ఫిజిక్స్‌–806, సోషల్‌–434 మంది తోపాటు బయాలజీలో 1178 మంది, అత్యధికంగా హిందీలో 1384 మంది పరీక్ష తప్పారు. వందశాతం ఉత్తీర్ణత 185 , 1–9 మంది వరకు విద్యార్థులు తప్పిన పాఠశాలలు 197 మంది ఉన్నారు. 10 మంది మొదలు గరిష్టంగా 59 మంది విద్యార్థుల వరకు తప్పిన పాఠశాలలు 76 నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు